వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్‌లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన అనేక విషయాలు బయటకు రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు. జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్‌గేట్స్‌కు ఉన్న సంబంధాల వల్లే తాను విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఎప్స్టీన్ ఫైల్స్‌లోని వివరాలు బయటకు వచ్చినప్పుడల్లా నాకు వ్యక్తిగతంగా చాలా కష్టంగా అనిపిస్తుంది.
నా వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన రోజులను అవి గుర్తు చేస్తున్నాయి’’ అని మిలిందా ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా బయటపడిన పత్రాలలో వచ్చిన ఆరోపణలపై బిల్ గేట్స్, ఇతరులు సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ ఇటీవల విడుదల చేసిన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిల్ గేట్స్ 2013లో రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగించడంతో సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఆరోపించాడు. కాగా, గేట్స్ బృందం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
