శ్రీశైలంలో 777 అడుగుల నుంచి తెలంగాణ నీళ్లను ఎత్తుకెళుతుంది: జగన్

శ్రీశైలంలో 777 అడుగుల నుంచి తెలంగాణ నీళ్లను ఎత్తుకెళుతుంది: జగన్

తాడేపల్లి: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం నిలిపివేసిన అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ప్రభుత్వం.. తెలంగాణకు తాకట్టు పెట్టిందని.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులకు కన్నీళ్లు మిగిల్చిందన్నారు జగన్.

శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వస్తాయన్నారు. గత పదేళ్లల్లో ప్రాజెక్టులో 881 అడుగుల్లో నీళ్లు రెండు, మూడు సార్లు మాత్రమే ఉన్నాయన్నారు. అలాంటప్పుడు పోతిరెడ్డిపాడుకు కేటాయించిన 101 టీఎంసీ నీళ్లను తరలించటం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు జగన్. 881 అడుగుల కెపాసిటీలోనే పోతిరెడ్డిపాడుకు ఫుల్ డిశ్చార్జ్ 44 వేల క్యూసెక్కులు వెళ్లే పరిస్థితి లేదన్నారు జగన్.

తెలంగాణ రాష్ట్రం 777 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీల నీళ్లను విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకుంటుందని.. అలాంటప్పుడు.. 881 అడుగుల వరకు నీళ్లు నిల్వ ఉండటం ఎలా సాధ్యం అవుతుందన్నారు జగన్. శ్రీశైలం ప్రాజెక్టులోని నీళ్లను తెలంగాణ ప్రభుత్వం కరెంట్ కోసం ఎడాపెడా వాడేస్తూ.. ప్రాజెక్ట్ ఖాళీ చేస్తుందంటూ ఆరోపించారు జగన్. 

పోతిరెడ్డిపాడు కింద అధికారికంగా కేటాయించిన 101 టీఎంసీ నీళ్లను వాడుకోవటానికే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను 800 అడుగుల దగ్గర ఏర్పాటు చేయటం జరిగిందన్నారు జగన్. 800 అడుగులలోపే రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే విధంగా లిఫ్ట్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ నిలిపివేయటం వల్ల రాయలసీమ రైతాంగానికి తీరని నష్టం జరుగుతుందని.. వర్షాలు పడని రోజుల్లో మంచినీళ్లకు కూడా కరువు వస్తుందన్నారు జగన్.