కరోనా సోకిన ప్రతీ 100లో 10 మందికి సీరియస్‌

కరోనా సోకిన ప్రతీ 100లో 10 మందికి సీరియస్‌
  • పెరుగుతున్న ఆక్సిజన్‌‌, వెంటిలేటర్‌ అవసరమయ్యే కేసులు
  • వేరే జబ్బులేవీ లేని వారిపైనా ఎఫెక్ట్‌
  • ప్రస్తుతం హాస్పిటళ్లలో 7,016 మంది పేషెంట్లు
  • ఇంట్లోనే ఉండి సొంత మెడిసిన్లు వాడటంతో పరిస్థితి సీరియస్
  • జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు

 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా సోకిన ప్రతి వంద మందిలో కనీసం పది మందిపై వైరస్ తీవ్రంగా ఎఫెక్ట్ చూపుతోంది. ఆక్సిజన్‌‌, వెంటిలేటర్‌పైకి వెళ్తున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 5 వేల మంది సీరియస్‌‌ కండిషన్‌‌లో ఆక్సిజన్‌‌ సపోర్ట్‌ తో‌ ట్రీట్మెంట్ పొంది  బయటపడగా.. 703 మంది చనిపోయారు. ప్రస్తుతం మరో 7,016 మంది సీరియస్‌‌ కండిషన్‌‌లో సర్కారీ, ప్రైవేట్ హాస్పిటళ్లలో  ట్రీట్మెంట్ పొందుతున్నారు. ముందే ఇతర జబ్బులు ఉన్నవారితో పాటు ఏ జబ్బూ లేనివాళ్లు కూడా ఈ సీరియస్ పేషెంట్ల జాబితాలో ఉంటున్నారు. కొందరు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తూనే.. ఒకట్రెండు రోజుల్లోనే సీరియస్ కండిషన్‌‌లోకి వెళ్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. వైరస్ సింప్టమ్స్ మొదలయ్యాక కూడా టెస్టులు చేయించుకోకపోవడం, సొంతంగా మెడిసిన్ వాడడం వల్ల పరిస్థితి సీరియస్ అవుతోందని స్పష్టం చేస్తున్నారు. హాస్పిటళ్లకు వెళ్లే లోపే లంగ్స్ దెబ్బతింటున్నా యని.. ఆక్సిజన్ పెట్టినా ఉపయోగం ఉండడం లేదని చెప్తున్నారు.

దవాఖాన్లలో 7.6 శాతం పేషెంట్లు

సర్కారు లెక్కల ప్రకారం ఇప్పటిదాకా రాష్ట్రంలో 92,255 కరోనా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం ఇందులో 7,016 మంది హాస్పిటళ్లలో ఉన్నరు. మొత్తం పాజిటివ్ కేసుల్లో7.6 శాతం మంది హాస్పిటళ్లలో ఉన్నట్ల ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 1,610 మంది పేషెంట్లు వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారని, మరో 3,023 మంది ఆక్సిజన్ సపోర్ట్‌ ‌మీద ట్రీట్ మెంట్ పొందుతున్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్ బులెటిన్‌‌లో పేర్కొన్నారు. కరోనా పేషెంట్లు వెంటిలేషన్ వరకూ వెళ్తే బతకడం కష్టమేనని డాక్టర్లు చెప్తున్నారు. ఇదివరకే సుమారు 5.14 శాతం మంది ఆక్సిజన్‌‌ సపోర్ట్ వరకూ వెళ్లి బయటపడ్డారు. అయితే సర్కారు మాత్రం 5 శాతం మంది పేషెంట్లకే ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడుతోందని చెప్తోంది. వాస్తవ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సర్కార్‌‌ బెడ్లు 7,862 రాష్ట్రంలో కరోనా ట్రీట్‌‌మెంట్ అందిస్తున్న దవాఖాన్ల సంఖ్య 42 కాగా.. ప్రైవేట్ హాస్పిటళ్లు 120 ఉన్నాయి. కరోనా పేషెంట్ల కోసం 17,804 బెడ్లు సిద్ధం చేసినట్టు సర్కారు చెప్పుకుంటున్నా.. అందులో 9,942 బెడ్లు ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్‌‌లోనివే. వాటిలో ఉచితంగా ట్రీట్‌‌మెంట్ ఇప్పిస్తామని సర్కారు చెప్పినా.. ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఇక సర్కారు దవాఖానాల్లో మిగిలింది 7,862 బెడ్లు. వీటిలో ప్రస్తుతం 2,592 మంది ఇన్‌‌పేషెంట్లు ఉండగా.. మరో 5,270 ఖాళీగా ఉన్నయి. ప్రైవేట్ హాస్పిటళ్లలో 8,001 బెడ్లు ఉండగా 4,424 మంది పేషెంట్లు ఉన్నారు, 3,577 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్మెంట్కు పర్మిషన్ ఇచ్చి ఉండకపోతే.. సర్కారు దవాఖాన్లలోని బెడ్లు దాదాపుగా ఫుల్‌ ‌అయ్యే వని, చాలా మందికి సకాలంలో ట్రీట్‌‌మెంట్ అందకపోయేదని ఎక్స్పర్టులు అంటున్నారు. అందువల్లే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లను నియంత్రించేందుకు సర్కార్‌‌‌‌ ధైర్యం చేయడం లేదని చెప్తున్నారు.