
- చైల్డ్ పోర్న్ చూసినా.. సెర్చ్ చేసినా జైలుకే!
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్
- 4 నెలల్లో 294 కేసులు.. 110 మంది అరెస్ట్
- డార్క్ వెబ్‌పై చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా
- రిపీటెడ్‌గా పోర్న్ చూస్తున్న 15 మంది మళ్లీ అరెస్ట్
- సోషల్ మీడియా యాప్స్‌లో గ్రూపులుగా ఏర్పడి గలీజ్ పనులు
- సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు (చైల్డ్ పోర్న్) చూసినా.. డౌన్లోడ్ చేసినా.. ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్ చేసినా.. జైలుకు వెళ్లక తప్పదని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. రిపీటెడ్‌గా చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న హైదరాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన 15 మందిని బుధవారం అరెస్టు చేశామని తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నెల 18 నుంచి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. డార్క్ వెబ్‌పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
‘‘చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా.. చూసినా.. డౌన్లోడ్ చేసినా.. అప్‌లోడ్ చేసినా.. వెంటనే అమెరికా కేంద్రంగా పనిచేసే ‘నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎమ్‌ఈసీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సైబర్ టిప్ లైన్ ద్వారా గుర్తిస్తున్నాం. ఈ ఏడాది చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏర్పాటు చేసిన 4 నెలల్లో 294 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినం. ఈ కేసులతో సంబంధం ఉన్న 110 మందిని అరెస్టు చేశాం. పట్టుబడిన వాళ్లంతా చైల్డ్ అబ్యూజివ్ వీడియోల్లో ఉన్న బాధితులంతా విదేశీ చిన్నారులుగా గుర్తించాం. నిందితుల్లో 19 ఏండ్ల నుంచి 50 ఏండ్ల వారున్నారు’’అని శిఖా గోయల్ తెలిపారు.
220 వెబ్‌సైట్స్‌లో అశ్లీల కంటెంట్
అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసిన ముఠాల్లో.. పట్టుబడిన నిందితులతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు శిఖా గోయల్ తెలిపారు. ‘‘సోషల్ మీడియా యాప్స్‌లో గ్రూపులుగా ఏర్పడి ఈ తరహా వీడియోలు షేర్ చేసుకుంటున్నట్లు గుర్తించాం. కొన్ని నెలల కింద సూర్యాపేటలో ఒక అమ్మాయితో బలవంతంగా చైల్డ్ పోర్న్ వీడియోలు చేయిస్తున్నట్టు తెలుసుకుని.. బాధితురాలిని అధికారులు రక్షించారు’’అని తెలిపారు. చిన్నారుల అశ్లీల కంటెంట్‌ను ప్రచారంచేస్తున్న 220 వెబ్‌సైట్లను టీజీసీఎస్‌బీ ద్వారా మూసి వేయించామని తెలిపారు.