V6 News

పదేళ్లకే రికార్డు... పదో తరగతి పరీక్షల్లో డిస్టింక్షన్‌లో పాస్

పదేళ్లకే రికార్డు... పదో తరగతి పరీక్షల్లో డిస్టింక్షన్‌లో పాస్

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అయాన్ గుప్తా అనే పదేళ్ల బాలుడు పదో తరగతి బోర్డు పరీక్షల్లో 76.67శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. అంతే కాదు అతను  డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణత సాధిండు. హిందీలో 73, ఇంగ్లీషులో 74, గణితంలో 82, సైన్స్‌లో 83, సోషల్ సైన్స్‌లో 78, కంప్యూటర్ పేపర్‌లో 70 మార్కులు సాధించాడు. యూపీ బోర్డు నియమం ప్రకారం10వ పరీక్షలో హాజరు కావడానికి విద్యార్థులు 14 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అయితే అయాన్‌ను పరీక్షకు హాజరు కావడానికి పాఠశాల ప్రిన్సిపాల్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.

అయాన్ గుప్తా గ్రేటర్ నోయిడా దాద్రీకి చెందిన వాడు. అయాన్ తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్,  తల్లి సవితా గుప్తా. వారు అయాన్ చదువుకు సంబంధించిన అన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసేవారు. కొవిడ్ సమయంలో అయాన్ పాఠ్య పుస్తకంపై విసుగు చెంది ఉన్నత చదువుల పుస్తకాలను చదవడం ప్రారంభించాడని తల్లిదండ్రులు చెప్పారు. హోమ్ ట్యూషన్ ఏర్పాటు చేయాలని, అతను బోర్డు నుంచి ప్రత్యేక అనుమతితో బోర్డ్ పరీక్షకు హాజరు కావాలని అప్పుడే నిర్ణయించుకున్నామని తెలిపారు. అయాన్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడన్న అతని తల్లిదండ్రులు.. ఇప్పుడు జేఈఈ (JEE) లాంటి ఇతర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం సంసిద్ధం అవుతున్నాడని స్పష్టం చేశారు.
 
ఉత్తరప్రదేశ్ బోర్డ్ 10వ,12వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 25, 2023న విడుదల చేసింది. పరీక్ష నిర్వహించిన 67 రోజుల్లో ఫలితాలను ప్రకటించింది. గత 100 ఏళ్లలో ఇదే తొలిసారి అక్కడ ఇంత త్వరగా ఫలితాలను ప్రకటించడం. యూపీ బోర్డు 67 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడంతో100 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టిందని ప్రభుత్వం తెలిపింది. పరీక్షలకు నమోదు చేసుకున్న 27 లక్షల మంది అభ్యర్థుల్లో 19 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే తమ యూపీ బోర్డ్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 75.52గా నమోదైంది.