తెలంగాణలో మరో 100 గురుకులాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

తెలంగాణలో మరో 100 గురుకులాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురుకుల పాఠశాలలకు విపరీతమైన డిమాండ్ ఉందని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా స్కూళ్లు లేవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి, బాల మాయాదేవిని కలిసి ఈ విషయంపై చర్చించారు. 

అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఉంటే, గురుకులాలు మాత్రం వందల్లోనే ఉన్నాయని, అందుకే వెంటనే అదనంగా 100 బీసీ గురుకుల పాఠశాలలను పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లోని బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్లు దొరకక విద్యార్థులు చదువు మానుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలతో పాటు ఎస్టీల కోసం మరో 50 కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు. నాయకులు పగిళ్ల సతీశ్, జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్ పాల్గొన్నారు.