108 మంది మావోయిస్టులు సరెండర్..101 ఆయుధాలు, కిలో బంగారం, రూ.3.61 కోట్లు అప్పగింత

108 మంది మావోయిస్టులు సరెండర్..101 ఆయుధాలు, కిలో బంగారం, రూ.3.61 కోట్లు అప్పగింత
  • వీరిపై రూ.3.29 కోట్ల రివార్డు : బస్తర్ ఐజీ సుందర్​రాజ్​

 భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలో బుధవారం భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. జగదల్​పూర్​లో బస్తర్​ఐజీ సుందర్​రాజ్ సమక్షంలో 44 మంది మహిళా మావోలు సహా 108 మంది 101 ఆయుధాలు, కిలో బంగారం, రూ.3.61 కోట్లు అప్పగించారు.  లొంగిపోయిన మావోయిస్టులపై రూ.3.29 కోట్ల రివార్డు ఉందని ఐజీ తెలిపారు. 2024 నుంచి ఈ నెల 9 వరకు మొత్తం 2,625 మంది   లొంగిపోయారని చత్తీస్​గఢ్​డీజీపీ అరుణ్ దేవ్​గౌతమ్​ప్రకటించారు. డెడ్​లైన్ లోపు మావోయిస్టులందరూ లొంగిపోవాలని సూచించారు. ముఖ్యులైన మావోల కదలికలకు సంబంధించి తమ వద్ద  సమాచారం ఉందని, సరెండర్​అయితే పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు.   

దండకారణ్యం స్పెషల్ ​జోనల్​ కమిటీవారే..

జగదల్​పూర్​లో సరెండర్​అయిన వారందరూ బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో విస్తరించిన దండకారణ్యం స్పెషల్​జోనల్​కమిటీలో వివిధ కేడర్లలో పని చేస్తున్నవారే. రాహుల్ తెల్లాం, పండ్రూ కొవ్వాసి, జిత్రూ ఓయాం, రామ్​ధర్, మల్లేశ్, ముచ్​కీ, ఏవోబీకి చెందిన కోసా మండావి వంటి కమాండర్లు లొంగిపోయారు. వీరి సరెండర్​ తో బస్తర్​ దండకారణ్యంలో నక్సల్స్ ప్రాబల్యం తగ్గినట్టేనని పోలీస్​అధికారులు అంటున్నారు. 

6 ఏకే-47లు,  ఒక ఏకే-47 తార్, 10 ఇన్సాస్​రైఫిల్స్, ఒక కార్బైన్, 5 ఎస్ఎల్ఆర్​రైఫిల్స్, 7 ఎస్ఎల్ఆర్ లు,  ఒక 62 ఎంఎం ఎల్ఎంజీ, రెండు 5.56 ఎంఎం ఇన్సాస్​ఎల్ఎంజీ, ఒక 303 ఎంఎం ఎల్ఎంజీ, ఇరవై 303 రైఫిల్స్, ఇరవై ఐదు 12 బోర్ రైఫిల్స్, 11 బీజీఎల్​లాంచర్స్,  ఒక 51 ఎంఎం మోర్టార్,  మూడు 315 బోర్ రైఫిల్స్, 13 బర్మార్ తుపాకులు, ఒక మెగా బీజీఎల్​ను మావోలు తమకు అప్పగించారని తెలిపారు. 7 జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.

ఒడిశాలో మరో 10 మంది..  

ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో బుధవారం10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కలహండి, -కందమాల్, బౌద్,- నయాగర్(కేకేబీఎన్) డివిజన్​కు చెందిన వారు10 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీరిపై  రూ.1.15 కోట్ల రివార్డు ఉంది. సరెండర్​అయిన వారిలో స్టేట్​కమిటీ మెంబర్ సానూ పొట్టం అలియాస్ నీతూ ఒకరు. నక్సల్స్ ముక్త్ ఒడిశా కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.