సికింద్రాబాద్​లో 11 నామినేషన్లు రిజెక్ట్..

సికింద్రాబాద్​లో 11 నామినేషన్లు రిజెక్ట్..

హైదరాబాద్/కంటోన్మెంట్/​ఎల్బీనగర్, వెలుగు: సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి మొత్తం 57 మంది అభ్యర్థులు 85 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, 11 మందికి సంబంధించిన నామినేషన్లు రిజెక్ట్​అయ్యాయి. 46 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. అలాగే చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తం 64 నామినేషన్లు​రాగా, 17 నామినేషన్లనుతిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశాంక తెలిపారు. 47 నామినేషన్లు ఫైనల్​చేసినట్లు తెలిపారు. స్క్రూటినీ తర్వాత ఎంత మంది బరిలో ఉంటారో తెలుస్తుంది. 29 వరకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు సాయంత్రం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

కంటోన్మెంట్​లో 21 నామినేషన్లు ఆమోదం

సికింద్రాబాద్​కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాని 24 నామినేషన్లు రాగా, 21 నామినేషన్లను ఆమోదించామని, మూడింటిని రిజెక్ట్ చేశామని కంటోన్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్​ తెలిపారు. మొత్తం 24 మంది 50 సెట్లు దాఖలు చేయగా.. బీజేపీ అభ్యర్థి ఎం.ఎ. శ్రీనివాస్​వేసిన రెండు నామినేషన్లను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. ఫాం–ఎ, ఫాం–బి సమర్పించకపోవడంతో రిజెక్ట్​చేసినట్లు తెలిపారు. ఇండిపెండెంట్ గా నామినేషన్​ వేసిన బంగారి రాజు నామినేషన్​లో పది మంది ప్రపోజల్స్​అవసరం ఉండగా 9 మంది మాత్రమే ప్రపోజ్​ చేయడంతో అతని నామినేషన్​ను తిరస్కరించామని చెప్పారు. లయన్స్​ఆఫ్​డెమాక్రటిక్ పార్టీ తరపున నామినేషన్ వేసిన నాగినేని సరిత తన   అఫిడవిట్​లో సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంతో రిజెక్ట్​ చేసినట్లు తెలిపారు. అలాగే మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్​రెబల్​గా రెండు నామినేషన్లు వేయగా అధికారులు రెండింటినీ రిజెక్ట్​ చేశారు. సర్వే సత్యనారాయణ ఇండింపెండెంట్​గా రెండు, కాంగ్రెస్​ రెబల్​గా రెండు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్​రెబల్​గా వేసిన నామినేషన్లలలో సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా అధికారులు తిరస్కరించారు. ఇండిపెండెంట్​గా వేసిన రెండు నామినేషన్లను ఆమోదించారు.