- అర్జునలొద్దిలో పాత రాతియుగం నాటి ఆనవాళ్లు గుర్తింపు
- అటవీ శాఖ, ప్రిహా సంస్థ అధయ్యనంతో వెలుగులోకి
హైదరాబాద్, వెలుగు: అటవీ అందాలకు, ఆదివాసీ కల్చర్, సంప్రదాయాలకు నెలవైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన గుహ ఒకటి బయటపడింది. జిల్లాలోని తిర్యాణి మండలం మేస్రమ్ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన సున్నపు రాతి గుహను జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్. శాంతారాం, గిన్నెధారి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తోడిశెట్టి ప్రణయ్ గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారంతో పబ్లిక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) జనరల్ సెక్రటరీ ఎంఏ శ్రీనివాసన్ బృందం గత వారం గుహను పరిశీలించింది. గుహ లోపలి దృశ్యాలను రికార్డు చేసి జియాలజిస్టుల సాయంతో అధ్యయనం చేసింది. గోండు, ప్రధాన్ గిరిజనులు ఎన్నో తరాలుగా అర్జున్ పేన్(అర్జున దేవుడు)గా కొలిచే శిల ఈ గుహలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని అర్జున లొద్ది అంటున్నారు. స్థానిక ఆదివాసీలకు ఎప్పటినుంచో ఈ గుహ తెలుసని శ్రీనివాసన్ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కవ్వాల్ టైగర్ జోన్ లో ఈ గుహ ఉందని, గుహ ఇరుకుగా ఉండటం వల్ల అక్కడక్కడా పాక్కుంటూ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తాము 30 మీటర్లు మాత్రమే వెళ్లగలిగామని, ఇంకా పొడుగ్గా ఉన్నా ముందుకు వెళ్లలేకపోయామన్నారు.
11 వేల ఏండ్ల కిందటే..
సుమారు1,25,000 నుంచి 11,000 ఏండ్ల మధ్య జరిగిన జియోలజికల్ మార్పుల వల్ల ఈ గుహ ఏర్పడి ఉంటుందని జియాలజిస్టులు చెప్తున్నారు. అయితే దాదాపు 54 కోట్ల ఏండ్ల కిందట నియో ప్రొటెరోజాయిక్ కాలంలో భూమిలో ఉన్న సున్నపురాయిని నీళ్లు తొలచడంతో ఈ ప్రక్రియ మొదలై ఉంటుందని, సుమారు1.25 లక్షల ఏండ్ల కిందటి నుంచి గుహ ఏర్పడటం మొదలై ఉంటుందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాల రావు చెప్పారు. కర్నూల్ గుహలపై జరిగిన రీసెర్చ్ ను బట్టి.. అర్జున లొద్ది గుహ ఏర్పడిన కాలాన్ని అంచనా వేయవచ్చన్నారు.
పాతరాతి యుగం వస్తువులు లభ్యం
అర్జున లొద్ది గుహ వద్ద పాతరాతి యుగంలో మానవులు ఉపయోగించిన రాతి వస్తువులు కూడా దొరికాయి. పక్కనే జలధార ఉన్నందున అప్పటి మనుషులు ఈ గుహను నివాస ప్రాంతంగా ఉపయోగించుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. గుహలో పైకప్పు నుంచి కిందికి, కింది నుంచి పైకి గట్టిపడి ఏర్పడ్డ స్టాలకైట్, స్టాలగ్మైట్ రాళ్లు ఉన్నాయి. ఇలా ఏర్పడ్డ ఓ శిలనే ఆదివాసీలు అర్జునుడిగా పూజిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక, అటవీ శాఖలు ఈ గుహను అడ్వెంచర్ టూరిస్ట్ ప్లేస్ గా అభివృద్ధి చేస్తే ఎకో టూరిజం, చరిత్ర అధ్యయనం రెండిటికీ లాభం జరుగుతుందన్నారు.
