- ద్రవిడ రాజకీయాల్లో గంట గంటకూ మారుతున్న పరిణామాలు
- విజయ్‌కి గవర్నర్ ముచ్చటగా మూడో‘సారీ’.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు నో
- మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో అనుమతి నిరాకరణ
- మొదట గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు.. సీఎంగా విజయ్ ప్రమాణానికి ఏర్పాట్లు!
- చేజారిన ఐయూఎంఎల్ మద్దతు.. అధికారిక ప్రకటన ఇవ్వని వీసీకే
- 116 దగ్గరే ఆగిపోయిన టీవీకే బలం.. సంఖ్యాబలంతో రావాలని చెప్పిన గవర్నర్
- కాంగ్రెస్, వామపక్షాల మద్దతున్నా
- విజయ్‌కి మరోసారి నిరాశే
- నేడు ప్రమాణ స్వీకారం లేనట్టే..
- సర్కారు ఏర్పాటుపై వీడని సందిగ్ధం
- హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు
- అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు
- ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖ
- ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో రోజంతా హైడ్రామా
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో గంట గంటకూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకున్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో టీవీకే కూటమి నిలిచిపోవడంతో, శనివారం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరిన విజయ్‌కి చుక్కెదురు కాగా.. మూడోసారి కూడా నిరాశే మిగిలింది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంల్‌లాంటి పార్టీలతో సుదీర్ఘ మంతనాల తర్వాత ఆ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించగా.. వారు ఇచ్చిన లేఖలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను విజయ్ నేతృత్వంలో టీవీకే నేతలు కలిశారు. ఈ క్రమంలోనే తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖలు అందించగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో శనివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో.. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఇంతలోనే మరో హైడ్రామా నెలకొంది. వీసీకే పార్టీ అధికారికంగా లేఖ ఇవ్వలేదని.. ఇతర పార్టీలు మద్దతు ఉపసంహంరించుకున్నాయని.. అందుకే లోక్‌భవన్ నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదని తెలిసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు (విజయ్ రెండు చోట్ల) గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజార్టీ మార్క్ (118)కు 11 స్థానాల దూరంలో ఆగిపోయింది.
తొలుత టీవీకేకు కాంగ్రెస్ (5 స్థానాలు) మద్దతు ప్రకటించింది. శుక్రవారం విజయ్ నేతృత్వంలో సుదీర్ఘ చర్చల తర్వాత సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే, ఇతర పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజార్టీ మార్కును చేరుకున్నట్లయింది. దీంతో 120 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉన్నట్టు గవర్నర్‌కు విజయ్ లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అయితే, కీలక సమయంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంల్) హ్యాండ్ ఇచ్చింది. విజయ్ కూటమిలో తాము భాగం కాదని ఐయూఎంఎల్ ప్రకటించింది.
మరోవైపు వీసీకే పార్టీ అధికారికంగా మద్దుతు లేఖను అందజేయలేదు. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపింది. దీంతో 116 సీట్ల వద్దే విజయ్ పార్టీ నిలిచిపోగా.. గవర్నర్‌నుంచి మరోసారి అనుమతి లభించలేదు. బుధ, గురువారాల్లో విజయ్‌తో భేటీ అయిన గవర్నర్ అర్లేకర్.. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖలు సమర్పించాలని కచ్చితంగా తేల్చి చెప్పారు.
113 మంది మద్దతుతో ప్రభుత్వం నడపడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దీంతో మద్దతు కూడగట్టేందుకు విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. మరోవైపు, తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ తన ఐదుగురు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఏఎంఎంకే గవర్నర్‌కు లేఖ రాయడం తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది.
విఫలమైన ‘అపవిత్ర’ పొత్తులు!
ఒక దశలో విజయ్‌ను అడ్డుకోవడానికి చిరకాల ప్రత్యర్థులైన డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు చేతులు కలిపేందుకు యత్నించాయనే వార్తలు వినిపించాయి. కానీ, పార్టీల సిద్ధాంతాలు, కార్యకర్తల వ్యతిరేకత దృష్ట్యా ఆ ‘అపవిత్ర’ పొత్తు సాధ్యపడలేదు. అటు బీజేపీ సైతం ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతోందని స్పష్టం చేసింది.
కాగా, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వార్తలు రావడంతో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలన నిర్ణయం తీసుకున్నది.
ఒకవేళ ప్రజా తీర్పును గౌరవించకుండా ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే.. తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు హెచ్చరించాయి. ఒకవేళ తమను పక్కన పెట్టి అన్నాడీఎంకే మద్దతుతో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తే.. అసెంబ్లీని రద్దు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే మేలని విజయ్ భావించినట్టు సమాచారం.
వామపక్షాలకు థ్యాంక్స్ చెప్పిన విజయ్
తమ పార్టీకి మద్దతు తెలిపిన వామపక్షాలకు విజయ్ థ్యాంక్స్ చెప్పారు. గవర్నర్ కలిసిన అనంతరం సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు విజయ్ నేరుగా వెళ్లారు. ఆ పార్టీ నేతలను కలుసుకొని కృతజ్ఞతలు చెప్పారు. కాగా, చెన్నైలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర నాయకుడు పి.షణ్ముగం మాట్లాడారు.
‘మేం టీవీకే కేబినెట్‌లో చేరం. బయటి నుంచే మద్దతిస్తం. మతతత్వ శక్తులను వ్యతిరేకించడానికి, రాష్ట్ర హక్కులను కాపాడటానికి మేం డీఎంకేతో కలిసి ప్రయాణిస్తం” అని వెల్లడించారు. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో టీవీకేకు మద్దతుగా ఓటు వేస్తాం.. కానీ మంత్రివర్గంలో మాత్రం చేరబోమని సీపీఎం నేత యు.వాసుకి తెలిపారు. వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని వీసీకే సైతం చెప్పిందని తెలిపారు.
