కొత్తపేటలో 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తులతో ప్రభుత్వ దవాఖాన

కొత్తపేటలో 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తులతో ప్రభుత్వ దవాఖాన

హైదరాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్‌ స్ధలంలో టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఓ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించనుంది. అయితే ఇది దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రిగా నిలవనుండడం చెప్పుకోదగిన విషయం. 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ఆసుపత్రిని 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తుల్లో నిర్మించనున్నట్టు సమాచారం. కాగా దేశంలో ప్రైవేటులోనూ ఇంత ఎత్తయిన ఆసుపత్రి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

దీనికి సంబంధించిన హాస్పిటల్ భవన నమూనా ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్రంలో భవన నిర్మాణం నిజంగానే చాలా ఎత్తులోనే కాదు.. అందంగానూ కనిపిస్తోంది. అయితే రూ.668 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణ టెండరును ఇటీవలే ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుంది. టిమ్స్‌ పేరుతో ఎల్బీనగర్‌తో పాటు అల్వాల్‌, సనత్‌నగర్‌లలో ఒక్కోటి వేయి పడకల సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తోంది. అదే గనక అయితే పట్టణ ప్రాంత వాసులకే కాదు... చుట్టుపక్కల నుంచి వచ్చే రోగులకూ అనువైన వైద్యం అందుబాటులోకి వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.