- ఇష్యూను సీఎం దృష్టికి తీసుకుపోని పెద్దాఫీసర్లు
- ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలింది 8,162 సీట్లే
- అందులో సగం కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలవే
- వెబ్ ఆప్షన్ టైమ్ వరకైనా తేల్చాలంటున్న పేరెంట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. కొత్త సీట్ల వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఏఐసీటీఈ ఎప్పటిలాగే కొత్త సీట్లకు అనుమతులు ఇచ్చినా రాష్ట్ర విద్యాశాఖ వద్దే ఆ ఫైలు ఆగిపోయింది. అసలు ఈ విషయాన్ని అధికారులు కనీసం సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లకపోవడంతో సీట్ల పెంపు వ్యవహారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అటు మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయి, తక్కువ సీట్లు మాత్రమే మిగలడంతో విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మిగిలింది తక్కువే
రాష్ట్రవ్యాప్తంగా 176 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 88,053 కన్వీనర్ కోటాలో సీట్లున్నాయి. వీటిలో ఎప్ సెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో 79,891 సీట్లు నిండాయి. ఇక కేవలం 8,162 సీట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో 4,133 సీట్లు కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ), ఆ అనుబంధ కోర్సులవే ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కాలేజీలు ఏఐసీటీఈ నుంచి దాదాపు 13 వేల వరకు కొత్త సీట్లకు పర్మిషన్ తెచ్చుకున్నాయి.
ఇవన్నీ దాదాపు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లవే కావడం గమనార్హం. ఈ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే కౌన్సిలింగ్ లో కొత్త సీట్లు యాడ్ అవుతాయి. దీంతో విద్యార్థుల మధ్య పోటీ తగ్గి, మంచి ర్యాంకర్లకు మెరుగైన కాలేజీల్లో సీట్లు దక్కుతాయని పేరెంట్స్ భావిస్తున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లని అధికారులు
కొత్త సీట్ల ఫైలు ముందుకు సాగకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం, వారి విదేశీ పర్యటనే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ టైమ్‌లో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన విదేశీ స్టడీ టూర్‌కి వెళ్లారు. దీంతో ఈ ఫైలు విద్యాశాఖ దగ్గరే పెండింగ్ పడిపోయింది. ఇప్పటివరకు కనీసం ఈ 13 వేల సీట్ల విషయాన్ని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు టూర్ నుంచి వచ్చిన నేపథ్యంలో.. వెంటనే ఆ ఫైలును సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కోర్ గ్రూపులకే ప్రయారిటీ?
కొత్త సీట్ల మంజూరుపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా భావిస్తోంది. కొత్తగా ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందిన వాటిలో ఆ కోర్ గ్రూపు సీట్లు ఉంటే వాటిని వెంటనే అనుమతించే అవకాశం ఉంది. ఒకవేళ ఐటీ, కంప్యూటర్ సైన్స్ సంబంధించి 13 వేల సీట్లకు పర్మిషన్ తెచ్చుకున్నా.. కేవలం మూడు నుంచి నాలుగు వేల సీట్ల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వెబ్ ఆప్షన్ల లోపు తేల్చాలి
ఈ నెల 17 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, 18 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానున్నది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా కొత్త సీట్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. సీట్లు యాడ్ అవుతాయనే ఆశతోనే ఫస్ట్ ఫేజ్ లో కొందరు విద్యార్థులు పరిమితంగా ఆప్షన్లు ఇచ్చారు. కాబట్టి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ టైమ్ వరకు అయినా దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి కొత్త సీట్లు ఇచ్చే ఆలోచన లేకపోతే.. ఆ విషయంపైన అయినా స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నారు. అప్పుడే తాము మేనేజ్ మెంట్ కోటాలోనో లేక ఇతర ప్రత్యామ్నాయం చూసుకుంటామని, జాప్యం చేస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందే అమ్ముకుంటున్న మేనేజ్మెంట్లు
కొత్త సీట్లపై స్పష్టత రాకముందే ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆ సీట్లను అమ్మకానికి పెట్టేశాయి. చివరి విడుత కౌన్సెలింగ్ వరకైనా వస్తాయని చెప్తూ విద్యార్థులకు బీ కేటగిరీ సీట్లు కట్టబెడుతున్నాయి. ఒకవేళ రాకపోతే, స్టూడెంట్లు నష్టపోయే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపైనా ప్రభుత్వం నిఘా పెంచాలని పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్స్ కోరుతున్నాయి.
