ఇబ్రహీంపట్నం, వెలుగు: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టడంతో బాలిక మృతిచెందింది. మంచాల సీఐ మధు తెలిపిన ప్రకారం, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బోచెన్ కన్నపల్లి గ్రామానికి చెందిన ఇ.అంజలి(14) ఇబ్రహీంపట్నం మండలం చెర్ల పటేల్ గూడలోని ఎంజేపీటీబీసీలో 8వ తరగతి చదువుతోంది. శనివారం అంజలిని కలవడానికి ఆమె తల్లి హాస్టల్‌కు వెళ్లింది.
అనంతరం ఇద్దరూ కలిసి మంచాల మండలం నోముల గ్రామంలోని ఎంజేపీటీబీసీ హాస్టల్‌లో చదువుతున్న ఆమె అన్నను చూసి తిరిగి వస్తుండగా, మంచాల నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు రోడ్డు దాటుతున్న అంజలిని ఢీకొట్టింది. నగరంలోని ఓ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
