
హైదరాబాద్, వెలుగు: వైద్య ఆరోగ్య శాఖలోని 1,466 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ విధివిధానాలపై జేఎన్టీయూ రిజిస్ర్టార్‌తో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి ఇటీవల సమావేశం నిర్వహించారు. పోస్టుల విద్యార్హత, దరఖాస్తు రుసుం, పరీక్ష విధానం, సిలబస్ సహా భర్తీకి అవసరమైన సమాచా రాన్ని ఈ నెల 30లోగా ఇవ్వాలని ఆయా విభాగాల హెచ్‌వోడీలను ఆదేశించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే బోర్డు ఏర్పాటు ప్రక్రియ ఇప్పటివరకూ పూర్తి కాలేదు.