
- సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
- బోర్డు వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లిస్ట్
హైదరాబాద్, వెలుగు: కానిస్టేబుల్ అభ్యర్థుల సెలెక్షన్ లిస్ట్‌ను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) బుధవారం రిలీజ్ చేసింది. నోటిఫై చేసిన16,604 పోస్టులకు గాను 15,750 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ లిస్ట్ గురువారం ఉదయం 8 గంటల నుంచి బోర్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. అభ్యర్థుల ఎంపిక వివరాలను బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు బుధవారం వెల్లడించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉండటంతో పోలీస్ ట్రాన్స్‌పోర్ట్‌లో 100 డ్రైవర్, ఫైర్ సర్వీసెస్‌లో 225 డ్రైవర్ పోస్టుల సెలెక్షన్స్ వెల్లడించలేదన్నారు. కటాఫ్ మార్కులతో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు వివరించారు. వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తరువాత సంబంధిత వివరాలను పూర్తి చేయాలని, 7వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు అటెస్టేషన్ ఫామ్స్ అప్‌లోడ్ చేయాలని సూచించారు.
అన్ని రకాల డాక్యుమెంట్లతో ఈ నెల 12,13 తేదీల్లో సంబంధిత కేడర్ డిస్ట్రిక్ట్, కమిషనరేట్లలోని అధికారుల ముందు హాజరుకావాలని తెలిపారు. బోర్డు విడుదల చేసిన లిస్ట్‌లో సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఫైర్ సర్వీసెస్, జైల్ వార్డర్ కానిస్టేబుల్స్ సహా ఐటీ అండ్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్‌లో మెకానిక్, కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కు సంబంధించిన 16,604 పోస్టులకు గాను ఎంపికైన పురుషులు, మహిళల వివరాలను వెల్లడించారు. అన్ని విభాగాల్లో మొత్తం 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఎంపికైనట్లు ప్రకటించారు.
ఇందులో 4,985 సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు గాను 3,298 మంది పురుషులు,1,622 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అలాగే, 4,423 ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) పోస్టులకు గాను 2,982 మంది పురుషులు, 948 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. టీఎస్‌ఎస్‌పీలో 5,010 పోస్టులకు గాను 4,725 మంది పురుషులు సెలెక్ట్ అయ్యారు.