ఒక్క బంతికి 16 పరుగులు

ఒక్క బంతికి 16 పరుగులు

బిగ్ బాష్ టీ20లీగ్లో స్టీవ్ స్మిత్ అదరగొడుతున్నాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవ్ స్మిత్..పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్..తాజాగా ఒక్క బంతికి 16 పరుగులు రాబట్టి సంచలనం సృష్టించాడు. 

సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచులో ఒకే బంతికి 16 పరుగులు వచ్చాయి. హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయెల్ పారిస్ వేసిన రెండో ఓవర్ మూడో బంతిని స్టీవ్ స్మిత్ సిక్సర్ కొట్టాడు. అయితే అది నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ లభించింది. ఫ్రీ హిట్ బాల్‌ను పారిస్ వైడ్ వేశాడు. అది కాస్తా ఫోర్గా వెళ్లడంతో ఐదు పరుగులు వచ్చాయి. తర్వాత ఫ్రీ హిట్ బంతిని స్మిత్ ఫోర్గా మలిచాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకి స్మిత్ 16 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్..20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆ తర్వాత హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులే చేయడంతో సిడ్ని సిక్సర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.