యూపీఐ ట్రాన్సాక్షన్ 2 వేలు దాటితే చార్జీ.. పర్సన్ టు పర్సన్ చెల్లింపులు ఫ్రీ

యూపీఐ ట్రాన్సాక్షన్ 2 వేలు దాటితే చార్జీ..  పర్సన్ టు పర్సన్ చెల్లింపులు ఫ్రీ
  • వ్యాపార లావాదేవీలపై రుసుము
  • వాళ్లు వినియోగదారులపై వేసే చాన్స్
  • ఎన్పీసీఐ ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు ఖరారు 
  • అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 నుంచి అమల్లోకి.. 
  • రూ. 75 వేలు లేదా అంతకంటే ఎక్కువ 
  • లావాదేవీలపై గరిష్టంగా రూ. 300  
  • నెలకు యూపీఐ క్యూఆర్ ద్వారా లక్ష స్వీకరించే వ్యాపారులకు చార్జీలు లేవు
  • రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధన వ్యాపారులకు లావాదేవీకి ఫ్లాట్ రూ.5
  • గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో చిరువ్యాపారి మొదలు బడా మాల్స్ వరకు నగదు రహిత చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకున్నది. గడిచిన ఆరేళ్లుగా సాగిన పూర్తి ఉచిత సేవలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెద్ద మొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రుసుమును విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఐ) చార్జీలను ఖరారు చేసింది. రూ.2 వేలకు మించి వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4 శాతం (రూ.8) ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

 అక్టోబర్‌‌ 15 నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సాధారణ వినియోగదారులకు ఊరట కల్పించింది. ఎప్పటిలాగే పర్సన్ టు పర్సన్‌‌ (పీ2పీ) యూపీఐ లావాదేవీలను ఉచితంగానే కొనసాగించవచ్చని పేర్కొన్నది. అలాగే, పీ2పీతోపాటు రూ.2వేలలోపు వ్యాపార చెల్లింపులు (పీ టు ఎం) ఎండీఆర్‌‌ పరిధిలోకి రావని స్పష్టంచేసింది.

కొత్త రుసుముల స్వరూపం ఇలా..

ఒక వినియోగదారుడు దుకాణంలో రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే, ఆ వ్యాపారి నుంచి బ్యాంకులు 0.4 శాతం రుసుమును వసూలు చేస్తాయి. అయితే ఈ చార్జీకి గరిష్ట పరిమితిని రూ. 300 గా నిర్ణయించారు. ఉదాహరణకు.. రూ. 3వేల చెల్లింపుపై వ్యాపారి రూ. 12, రూ. 50వేల చెల్లింపుపై రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. రూ. లక్ష కొనుగోలు జరిగినా కూడా గరిష్ట పరిమితి ప్రకారం రూ.300 మాత్రమే కట్ అవుతుంది.

నిత్యావసర రంగాలు, సేవలపై ఫ్లాట్‌‌ చార్జీ

రైల్వే టికెట్లు, టెలికాం రీచార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పెట్రోల్/డీజిల్ బంకుల్లో చెల్లింపులు, విత్తనాలు, -ఎరువుల కొనుగోళ్లకు ప్రత్యేక రాయితీ కల్పించారు. వీటిలో రూ. 2 వేలు దాటిన లావాదేవీలపై శాతంతో పనిలేకుండా ఫ్లాట్‌‌గా రూ. 5 మాత్రమే చార్జీ విధిస్తారు. విద్యుత్, నీరు, గ్యాస్‌‌లాంటి ప్రభుత్వ యుటిలిటీ బిల్లులు, పాఠశాలలు-, విశ్వవిద్యాలయాల ఫీజుల చెల్లింపులకూ ఇదే రూ. 5 నిబంధన వర్తిస్తుంది. ఇక, మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లకు చేసే చెల్లింపులపై నామమాత్రపు 0.02 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి రూ.300. అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, స్టాక్ బ్రోకర్లు, షేర్ల కొనుగోలు, డెట్ మార్కెట్, బ్రోకర్ వాలెట్ టాప్-అప్‌ల కోసం చేసే లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయి.  

సామాన్యుడికి రక్షణ.. చిరు వ్యాపారులకు ఊరట

నెలకు రూ. లక్ష వరకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాపారం చేసే వీధి వ్యాపారులు, టీ బంకులు, చిన్న కిరాణా కొట్లకు ఎలాంటి చార్జీలు వర్తించవు. గ్రామీణ ప్రాంతాల్లోని క్యూఆర్ కోడ్ చెల్లింపులకూ ఈ రక్షణ కొనసాగుతుంది.ఈ నిర్ణయం వల్ల రోజువారీ లావాదేవీలు చేసుకునే సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇక స్నేహితులు, బంధువులకు ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే (పీ2పీ) సొమ్ముపై రూపాయి కూడా చార్జీ ఉండదు. లావాదేవీ విలువ ఎంతైనా ఇది పూర్తి ఉచితం. రూ. 2వేల లోపు చేసే వ్యాపార చెల్లింపులన్నింటికీ ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. కాగా, మొత్తం యూపీఐ పీ2ఎం లావాదేవీల్లో 95 శాతానికి పైగా రూ.2వేల లోపే ఉండటం వల్ల చిన్న వ్యాపారులపై ఎలాంటి ఎఫెక్ట్‌‌ ఉండదని ఎన్‌‌పీసీఐ తెలిపింది. టైర్‌‌-3, అంతకంటే చిన్న పట్టణాల్లో డిజిటల్‌‌ చెల్లింపుల మౌలిక వసతుల విస్తరణ, చిన్న వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వ్యాలెట్లతో పోలిస్తే సవరించిన ఈ యూపీఐ ఎండీఆర్‌‌ రుసుములు చాలా తక్కువని పేర్కొన్నది. యూపీఐ యాప్‌‌లు ప్లాట్‌‌ఫామ్‌‌ ఫీజులు, రహస్య చార్జీలు విధించకూడదని ఎన్‌‌పీసీఐ తెలిపింది.  అలాగే, వ్యాపారులు ఈ ఖర్చును వస్తువుల ధరలు పెంచి వినియోగదారులపై రుద్దరాదని కేంద్రం హెచ్చరించింది. యూపీఐ ప్లాట్‌‌ఫామ్స్ ఎలాంటి రహస్య చార్జీలు, ప్లాట్‌‌ఫామ్ రుసుములు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది.

ఏమిటీ ఎండీఆర్?  

డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహించే బ్యాంకులు, నెట్‌‌వర్క్ సంస్థలకు వ్యాపారులు చెల్లించే రుసుమును ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’(ఎండీఆర్‌‌‌‌) అంటారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2020 నుంచి యూపీఐకి ఎండీఆర్ మినహాయింపు ఇచ్చారు. అయితే, ప్రతినెలా బిలియన్ల కొద్దీ లావాదేవీలు జరుగుతుండటంతో సెక్యూరిటీ, సర్వర్ల నిర్వహణ 
భారంగా మారిందని బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పెద్దమొత్తంలో జరిగే లావాదేవీలపై పరిమితంగా ఎండీఆర్ విధించే అంశంపై ఎన్‌‌పీసీఐ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఎందుకీ మార్పు?  

గత ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా 2,451 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా దాదాపు రూ. 29.9 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంతటి భారీ వ్యవస్థను నిరంతరం నడిపించేందుకు, సర్వర్ల వేగం పెంచేందుకు, సైబర్ భద్రత, మోసాల నియంత్రణ కోసం బ్యాంకులు, ఫిన్‌‌టెక్ సంస్థలకు ఏటా రూ. 20 వేల కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఇప్పటివరకు కేంద్రం బడ్జెట్ నుంచి ఏటా దాదాపు రూ. 2 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తూ నెట్టుకొచ్చింది. అయితే ఖజానాపై భారం తగ్గించుకోవాలని, వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించాలంటే నామమాత్రపు యూజర్ చార్జీలు తప్పవని పార్లమెంటరీ స్థాయీ సంఘంతోపాటు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గతంలోనే సూచించారు. తాజా నిర్ణయంతో బ్యాంకులు, చెల్లింపు యాప్‌‌లకు కొంత ఆదాయం సమకూరి, మౌలిక వసతులు మెరుగుపడతాయని ఎన్‌‌పీసీఐ పేర్కొన్నది.