- 7 వికెట్ల తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్
- 2-0తో సిరీస్ టీమిండియా సొంతం
- రాణించిన అభిషేక్, ఇషాన్, నితీశ్
న్యూఢిల్లీ:లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ (22 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), అభిషేక్ శర్మ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39) దంచికొట్టడంతో.. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37) టాప్ స్కోరర్. తర్వాత ఇండియా 14.5 ఓవర్లలో 163/3 స్కోరు చేసింది. నితీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నితీశ్ విజృంభణ
ముందుగా బౌలింగ్‌కు దిగిన ఇండియా బౌలర్లు అఫ్గాన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. బుమ్రా (1/25) తొలి ఓవర్‌ను మెయిడెన్ వేసి అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. అర్ష్‌దీప్ (2/35) వేసిన రెండో ఓవర్‌లోనే రెహమానుల్లా గుర్బాజ్ (0) డకౌటయ్యాడు. 1/0 స్కోరుతో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను జద్రాన్, సెడిఖుల్లా అటల్ (12) చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 41/1 స్కోరుతో పవర్‌ప్లేను ముగించిన ఈ జోడీని 9వ ఓవర్‌లో నితీశ్ (3/24) విడగొట్టాడు. జద్రాన్‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక్కడి నుంచి స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ ఎండ్‌లో డార్విష్ రసోలి (26) నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో అటల్, గుల్బాదిన్ నైబ్ (10), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (11) వికెట్లు తీశారు. ఫలితంగా 7 నుంచి 14 ఓవర్ల మధ్య కేవలం 64 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. చివర్లో మహ్మద్ నబీ (20), రషీద్ ఖాన్ (28) దూకుడుగా ఆడారు. ఏడో వికెట్‌కు 48 రన్స్ జత చేయడంతో స్కోరు 150 రన్స్ దాటింది. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
రషీద్ మూడు తీసినా.
చిన్న టార్గెట్ ఛేజింగ్‌ను అభిషేక్ దూకుడుగా మొదలుపెట్టాడు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్లలో రెండు సిక్స్‌లు బాదాడు. అవతలి వైపు శాంసన్ కూడా 4, 4, 6, 4, 4తో బ్యాట్ ఝుళిపించాడు. దాంతో ఐదు ఓవర్లలోనే 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను పూర్తి చేశారు. నబీ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్ 6, శాంసన్ 6, 4, 4, 6తో 26 రన్స్ దంచాడు. దాంతో పవర్‌ప్లేలో ఇండియా 82/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో రషీద్ ఖాన్ (3/36) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తొలి బాల్‌కు సిక్స్ కొట్టిన అభిషేక్‌ను రెండో బాల్‌కు ఔట్ చేశాడు. ఫలితంగా తొలి వికెట్‌కు 88 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. నాలుగో బాల్‌కు ఫోర్‌తో 20 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన శాంసన్‌ను ఆఖరి బాల్‌కు పెవిలియన్‌కు పంపాడు. ఈ ఓవర్‌లో 17 రన్స్ ఇచ్చిన రషీద్ రెండు వికెట్లు తీయడంతో ఇండియా స్కోరు 99/2గా మారింది. ఇషాన్ కిషన్ (38 నాటౌట్) సిక్స్‌తో టచ్‌లోకి రాగా, శ్రేయస్ అయ్యర్ (11) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. 10 ఓవర్లలో స్కోరు 117/2కు చేరింది. అయితే 11వ ఓవర్‌లో సిక్స్ కొట్టిన శ్రేయస్‌ను రషీద్ వెనక్కి పంపాడు. మూడో వికెట్‌కు 24 రన్స్ జతయ్యాయి. ఇషాన్‌కు తోడైన తిలక్ వర్మ (15 నాటౌట్) నిలకడగా ఆడాడు. 14వ ఓవర్‌లో ఇషాన్ 4, 6, 4తో 17 రన్స్ రాబట్టి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్: 20 ఓవర్లలో 159/8 (జద్రాన్ 37, రషీద్ 28, నితీశ్ 3/24). ఇండియా: 14.5 ఓవర్లలో 163/3 (శాంసన్ 57, అభిషేక్ 39, రషీద్ 3/36).
10 టీ20ల్లో ఇండియాపై వరుసగా అత్యధికంగా ఓడిన తొలి జట్టు అఫ్గానిస్తాన్ (2010–26). బంగ్లాదేశ్ (2019–25) తొమ్మిది ఓటములతో రెండో ప్లేస్‌లో ఉంది.
