కేబీఆర్ చుట్టూ పనులకు బ్రేక్?.. వన్‌‌వేతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని పునరాలోచన!

కేబీఆర్ చుట్టూ పనులకు బ్రేక్?.. వన్‌‌వేతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని పునరాలోచన!
  • వారం నుంచి ఆగిన  ఫ్లై ఓవర్లు, స్టీల్​ బ్రిడ్జి, అండర్‌‌పాస్ వర్క్స్​
  • 453 ఆస్తుల సేకరణ చిక్కులు, 
  • కోర్టు కేసుల తలనొప్పులతో  
  • రీ అలైన్​మెంట్​పై డిస్కషన్స్​
  • ట్రాఫిక్ పోలీసులతో జీహెచ్‌‌ఎంసీ చర్చలు
  • ఈ నెలాఖరులోపు నిర్ణయం?

 హైదరాబాద్ సిటీ, వెలుగు:  కేబీఆర్ పార్కు చుట్టూ స్టీల్ బ్రిడ్జి, అండర్‌‌పాస్ నిర్మాణ పనుల రీ అలైన్మెంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పార్కు చుట్టూ ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌‌వే ట్రాఫిక్ విధానంతో ట్రాఫిక్ సమస్య కొంతమేరకు పరిష్కారమైందని అధికారులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఉన్నట్టు ఎక్కడా ట్రాఫిక్​ఆగకుండా సాఫీగా సాగుతుండడంతో భారీ వ్యయంతో నిర్మించాలనుకున్న స్టీల్​ ​బ్రిడ్జి, అండర్‌‌పాస్ ల నిర్మాణంపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తున్నది.

 హెచ్ సిటీలో భాగంగా రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌‌పాస్‌‌ల నిర్మాణాలను యథాతథంగా కొనసాగించాలా? లేక ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పులు చేయాలా? అనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులతో పాటు నిపుణులతో జీహెచ్ఎంసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పార్కు చుట్టూ 453 ఆస్తులను సేకరించాల్సి ఉండటం అధికారులకు కూడా సవాలుగా మారింది. 

ఇందులో కొందరు ఆస్తుల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తుల సేకరణను సాధ్యమైనంత వరకు తగ్గించేలా ప్రతిపాదిత మార్గాన్ని రీఅలైన్‌‌మెంట్ చేసే అంశంపై  పరిశీలన చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం, ట్రాఫిక్ అవసరాలు, ఆస్తుల సేకరణ, భవిష్యత్‌‌లో ట్రాఫిక్ పెరిగే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

కొనసాగుతున్న చర్చలు

 కేబీఆర్ పార్కు చుట్టూ ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌‌వే విధానంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని, వన్‌‌వే ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తే..ప్రతిపాదిత స్టీల్ బ్రిడ్జి, అండర్‌‌పాస్ అవసరం ఉంటుందా అనే అంశంపై ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో జీహెచ్‌‌ఎంసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోవాలా? లేక మార్పులు చేసి కొనసాగించాలా? అనే అంశంపై డిస్కస్​చేస్తున్నారు. 

రీఅలైన్‌‌మెంట్ ప్రతిపాదన, ఆస్తుల సేకరణ తగ్గించే అవకాశాలు, వన్‌‌వే విధానం వల్ల ట్రాఫిక్‌‌పై ఏర్పడిన ప్రభావం తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ నెలాఖరు నాటికి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణలో తదుపరి కార్యాచరణ ఆధారపడి 
ఉండనున్నది.

స్పష్టత వచ్చాకే షురూ

కేబీఆర్ పార్కు నిర్మాణాలపై చర్చలు జరుగుతుండటంతో  వారం నుంచి పనులు బంద్ చేశారు. ఇప్పటికే ముగ్ధ జంక్షన్ రూట్​లో పిల్లర్లు వేయగా, అగ్రసేన్ జంక్షన్ వద్ద అండర్ పాస్ కోసం తవ్వకాలు జరిపారు. అయితే అంతలోనే ఇక్కడ ట్రాఫిక్ తగ్గిందనే అంశం చర్చకు రావడంతో పనులకు బ్రేక్​వేశారు. స్పష్టత వచ్చిన తర్వాతే పనులు తిరిగి స్టార్ట్ చేసే అవకాశముంది.