సిద్దిపేట జిల్లాలో160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

  సిద్దిపేట జిల్లాలో160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో ముగ్గురు పట్టుబడ్డారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. బెజ్జంకి ఎడ్లబండి చౌరస్తా వద్ద కొందరు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐలు రమేశ్, జానకిరామ్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్ఐ తిరుపతిరెడ్డి, బెజ్జంకి ఏవో బండ సంతోష్ సిబ్బందితో వెళ్లారు. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి మండలం సర్వాయిపేటకు చెందిన దుర్గం శేఖర్ ను అదుపులోకి తీసుకుని 4 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని విచారించారు. 

బెజ్జంకి శివారులోని శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పట్టు పురుగుల కేంద్రం వద్ద నిల్వ చేసిన 4 బస్తాల్లోని 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. విత్తనాలు తెచ్చి అమ్ముతున్న ఏపీలోని కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఇనుకొల్లు వసంత రాంరెడ్డి, నంద్యాల జిల్లా కొండపల్లికి చెందిన కుందవరం ప్రభాకర్ ను అరెస్టు చేసి రిమాండ్‎కు పంపారు. నకిలీ విత్తనాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా అమ్ముతున్నట్లు తెలిస్తే, 100 కు లేదా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ నంబర్లు 8712667445, 8712667446,  87126677447లో  తెలపాలని సూచించారు.