పర్యటనకు వచ్చి అనంత లోకాలకు.. ఢిల్లీ ప్రమాద మృతుల్లో 17 మంది విదేశీయులు

పర్యటనకు  వచ్చి అనంత లోకాలకు.. ఢిల్లీ ప్రమాద మృతుల్లో 17 మంది విదేశీయులు

ఢిల్లీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకులను పొట్టన పెట్టుకుంది. ఎప్పటిలాగే టిఫిన్ కోసం వచ్చిన వారు కొందరు.. ఢిల్లీ అందాలను చూద్దామని వచ్చి హోటల్ లో స్టే చేస్తున్న వారు మరికొందరు. మొత్తం 21 మంది ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, అత్యాశ అమాయకులను బలితీసుకుంది.

బుధవారం (జూన్ 03) ఉదయం లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో.. 21 మంది చనిపోగా.. అందులో 17 మంది విదేశీయులే ఉండటం హృదయవిదారకంగా మారింది. అందులో ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు చెందిన పర్యాటకులుగా ప్రాథమిక విచారణలో తేలింది.  బంగ్లాదేశ్, నైజీరియా, లైబీరియా,మొజాంబిక్ తదితర దేశాల పర్యాటకులుగా గుర్తించారు. మాల్వియా నగర్ లోని హాజ్ రాణీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం నుంచి ఇంకా ఢిల్లీ కోలుకోనేలేదు. గాయపడిన వారి హాహా కారాలతో ఆసుపత్రులు ప్రతిధ్వనిస్తున్నాయి. 

ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలో ఉన్న మ్యాక్స్ ఆసుపత్రికి మంటలో కాలిపోయిన వారిని తీసుకొచ్చినట్లు యాజమాన్యం చెప్పింది. మొత్తం 39 మందిని తీసుకురాగా అందులో 18 మంది అప్పటికే చనిపోయి ఉన్నట్లు తెలిపారు. 15 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 8 మంది వెంటిలేటర్ సపోర్ట్ తో క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్లు తెలిపారు. 

  • నిర్వాహకుల దురాశ, నిర్లక్ష్యం:

ఢిల్లీ ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హౌజ్ రాణి ప్రాంతంలోని ఈ హోటల్‌కు ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బి&బి) పథకం కింద లైసెన్స్ మంజూరు చేసింది. ఒక కాంప్లెక్స్ కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఫ్లోరిష్ స్టే, బేస్‌మెంట్‌లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులను నిర్మించిన యాజమాన్యం.. ఇంతమంది చావుకు కారణమైందని అంటున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ హోటల్‌కు ఎంట్రీ, ఎగ్జిట్‌కు ఒకే దారి ఉంది. ఈ హోటల్‌లో 25 రూమ్ లు ఉండటం, ఏ సమయంలోనైనా అనేక మంది  స్టే చేస్తుంటారు. దీనికి తోడు హోటల్‌కు సేఫ్టీ మెజర్స్ కు సంబంధించిన అనుమతులు కూడా లేనట్లు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు  ఆరా తీస్తున్నారు.

  • పరారీలో ఓనర్:

ఘటన జరిగిన వెంటనే హోటల్ ఓనర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఫ్లోరిష్ ఇన్ హోటల్ ఓనర్ అయిన లోకేష్​ బజాబ్.. ఈ హోటల్ కు ఓనర్ గా గుర్తించారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోకేష్ బజాజ్ అందుబాటులో లేనట్లు తెలిపారు.