ఒడిశా నుంచి గుజరాత్ కు గంజాయి...సికింద్రాబాద్ లో ఇద్దరు అరెస్ట్

ఒడిశా నుంచి గుజరాత్ కు గంజాయి...సికింద్రాబాద్ లో ఇద్దరు అరెస్ట్
  •     17 కిలోల సరుకు సీజ్

పద్మారావునగర్, వెలుగు: ఒడిశా నుంచి గుజరాత్​కు రైళ్లలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్‌‌పీ, ఆర్‌‌పీఎఫ్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 8.95 లక్షల విలువైన 17.909 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్సీ జావేద్, ఇన్​స్పెక్టర్లు సాయి ఈశ్వర్​గౌడ్, సారస్వత్‌‌ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఒడిశాకు చెందిన దీపక్ స్వైన్ (24)తో పాటు ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు సూరత్​లో నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరిద్దరికీ రాజేశ్ కుమార్ అనే స్మగ్లర్ ఒక్కో ప్యాకెట్​కు రూ. 7 వేలు ఇస్తానని ఆశ చూపాడు. 

దీంతో వారు ఈ నెల 7న ఒడిశాలోని ఫుల్బాని అటవీ ప్రాంతంలో గంజాయి తీసుకుని విశాఖ ఎక్స్​ప్రెస్​లో సికింద్రాబాద్ చేరుకున్నారు. స్టేషన్ లోని జనరల్ వెయిటింగ్ హాల్లో సూరత్ రైలు కోసం వేచి చూస్తుండగా, తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వారి లగేజీని సోదా చేశారు. రెండు ట్రాలీ సూట్​కేసుల్లో దాచిన 9 గంజాయి ప్యాకెట్లు బయటపడటంతో ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు.