అస్సాం "టీ"కు 200 ఏండ్లు..ఏడాది పాటు వేడుకలు

అస్సాం "టీ"కు 200 ఏండ్లు..ఏడాది పాటు వేడుకలు

ప్రపంచంలోనే  తేయాకు ఉత్పత్తిలో భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు కార‌ణం అస్సాం. అస్సాంలో ప్రతీ ఏడాది  700 మిలియన్ టీ ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ దాదాపు 22లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వందల సంఖ్యలో టీ తోటలు ఉన్నాయి. 1823లో మొదలైన అస్సాం టీ 200 ఏండ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా 200 సంవత్సరాల అస్సాం టీ వేడుకలను  గౌహతి టీ వేలం సెంటర్ ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఏడాది పొడవునా అస్సాం టీ 200 ఏండ్ల వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. 

ఏడాది పొడవునా వేడుకలు..

2023 మే నుండి  అస్సాం టీ 200 ఏండ్ల వేడుకలు ప్రారంభమవుతాయని గౌహతి టీ వేలం కొనుగోలుదారుల సంఘం కార్యదర్శి దినేష్ బిహానీ తెలిపారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమాలు  నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని టీ వేలం కేంద్రాల అధికారులను ఆహ్వానించి సత్కరిస్తామన్నారు.  గౌహతి టీ వేలం కేంద్రానికి అస్సాం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించిందని... అస్సాం టీని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ -నవంబర్‌లో సెమినార్‌ని నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సెమినార్లో వాతావరణ మార్పు, తేయాకు పరిశ్రమపై దాని ప్రభావం గురించి చర్చిస్తామన్నారు. ఈ సెమినార్ కు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తేయాకు  కొనుగోలుదారులు, విక్రేతలు, టీ టేస్టర్లు, వాటాదారులను ఆహ్వానిస్తామన్నారు. అస్సాం టీకి పూర్వ వైభవాన్నితీసుకురావడమే తమ లక్ష్యమని బిహానీ అన్నారు. అస్సాం టీ రుచి చూడటానికి పర్యాటకులను ఆహ్వానిస్తున్నామని...అస్సాం టీని ప్రోత్సహించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లో కార్యక్రమాలను నిర్వహించి.., స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు.  

రోడ్ షోలు..

మరోవైపు  అస్సాం టీ  200 సంవత్సరాలను పురస్కరించుకుని.. అస్సాం టీని బ్రాండ్‌గా ప్రచారం చేయడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో..విదేశాలలోని రోడ్ షోలను నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ వెల్లడించారు. అస్సాం టీని బ్రాండ్‌గా ప్రమోట్ చేయడానికి, టీ గార్డెన్ కమ్యూనిటీల గొప్ప సామాజిక-సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి రోడ్ షోలను నిర్వహించాలని  నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దాదాపు రెండు శతాబ్దాలుగా, టీ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని... టీ పరిశ్రమ వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిందన్నారు. దేశ జనాభాలో గణనీయమైన భాగం టీపై ఆధారపడి ఉంటుందన్నారు. నేటికీ దేశ ఎగుమతుల్లో 90 శాతం వాటా "టీ " పరిశ్రమ దే అన్నారు. 

టీ ఎలా పుట్టింది..

టీని మొదటగా చైనాలో కొనుగొన్నారు. క్రీస్తుపూర్వం 2,737లో షెన్‌ నాంగ్‌ అనే చక్రవర్తి ఓ రోజు తన కోటలోని తోటలో కూర్చున్నారు. పనిమనిషి రాజు తాగడానికి మంచినీటిని వేడి చేస్తుండగా కొన్ని ఆకులు గాలిలో తేలియాడుతూ వచ్చి వేడి నీటిలో పడ్డాయి. అయితే ప్రయోగాలు చేయడం షెన్‌కు అలవాటే కాబట్టి.. ఆకు పడిన నీటిని అలాగే తాగేశాడు. రుచి బాగుండటంతో  ఆ ఆకులు ఏ చెట్టువో కనిపెట్టి వాటితో టీ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తొలిసారి టీ రుచి మానవుడికి తెలిసింది. 

అసోంలో తేయాకు ఎలా తెలిసింది

1660 కాలంలో దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగించారు. ప్రజలకు తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడు నీటిలో ఈ ఆకును వేసి.. నిమ్మరసం కలిపి తాగించేవారు. అప్పటికే సింగ్‌పోస్‌ తెగ ప్రజలు ఈ తేయాకులను పండిస్తున్నారు. అయితే 1823లో వ్యాపారం నిమిత్తం భార‌త్‌కు వ‌చ్చిన స్కాంట్లాండ్ దేశ‌స్థుడు రాబర్ట్‌ బ్రూస్.. అసోంలోని రంగ్‌పుర్‌లో తేయాకు చెట్టు పెరుగుతుండ‌టాన్ని గమనించాడు. ఆ తర్వాత బ్రిటీష్‌ పాలకులు 1839లో అసోం టీ కంపెనీని  స్థాపించి తేయాకును పండించడం ప్రారంభించారు. వారి వద్ద పనిచేసిన మణిరామ్‌ దివాన్‌ అనే భారతీయుడు ఉద్యోగం మానేసి సొంతంగా తేయాకు తోటల పెంపకం మొదలు పెట్టి.. టీ పౌడర్‌ అమ్మకాలు ప్రారంభించాడు. అలా 1862 నాటికి అస్సాంలో  160 తేయాకు తోటలు ఏర్పడ్డాయి.  ప్రస్తుతం 800కుపైగా తేయాకు తోటలు ఉండటం విశేషం.