
- ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్‌లో చెత్తాట
- టీమ్, బోర్డులో పాలిటిక్స్‌తో విమర్శలు
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)క్రికెట్ ప్రపంచాన్ని శాసించే బోర్డు మనది. సూపర్ స్టార్లు, సత్తా ఉన్న ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. నాణ్యమైన కోచ్‌లున్నారు. కానీ, కొన్నాళ్లుగా ఇండియా క్రికెట్ పరిస్థితి దిగజారుతోంది. వరల్డ్ కప్ నెగ్గక పుష్కర కాలం సమీపిస్తుండగా.. 2022 టీమిండియాకు చేదుజ్ఞాపకాలే మిగిల్చింది. విరాట్ కోహ్లీ ప్లేస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టడంతో ఈ ఏడాది టీమ్ కొత్త శిఖరాలకు వెళ్తుందని ఆశిస్తే.. చివరకు మన ఆట ఎటు పోతుందో తెలియని క్రాస్ రోడ్స్‌లో నిలిచిపోయింది. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ అద్భుత పోరాటంతో టీమ్‌ను గెలిపించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఫ్యాన్స్‌ను ఏకం చేయడం తప్పితే ఈ ఏడాదిలో ఇండియన్ క్రికెట్‌ను చూసి గర్వించదగ్గ విషయాలే లేవు. పైగా, గ్రౌండ్ లోపలా, బయటా వివాదాలకు కేంద్రంగా మారింది. ఐపీఎల్ మీడియా రైట్స్ రూపంలో రూ. 48 వేల కోట్లు సమకూరడంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే యంగ్‌స్టర్స్‌కు బూస్టప్ కలిగింది. కానీ, మెన్స్ క్రికెట్ టీమ్ చెత్తాటతో విమర్శలు ఎదుర్కొంది.
కోహ్లీ వర్సెస్ బీసీసీఐ
ఓవైపు ఇంగ్లండ్ టీమ్‘బజ్‌బాల్’ స్టయిల్‌తో నిర్భయంగా, దూకుడుగా ఆడుతూ అన్ని ఫార్మాట్లలో అద్భుత ఫలితాలు రాబడుతుంటే.. ఇండియా రివర్స్ గేర్‌లో నడుస్తోంది. దూకుడు చూపెడతామన్నా మనోళ్ల మాటలు మైకులకే పరిమితం అవుతున్నాయి తప్ప మైదానంలో కనిపించడం లేదు. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌లో ఓటమితో విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమ్‌లో అనిశ్చితి మొదలైంది. బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీతో గొడవ..కోహ్లీతో పాటు జట్టునూ ప్రభావితం చేసింది. అంతకుముందే వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించడంతో నొచ్చుకున్న విరాట్ టెస్టు సారథ్యం కూడా వదులుకున్నాడనేది బహిరంగ రహస్యం. విరాట్ వారసుడిగా అన్ని ఫార్మాట్ల బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ కెప్టెన్‌గా సక్సెస్ కొట్టలేకపోయాడు. ఆసియా కప్‌లో గ్రూప్ దశలో, టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓటమితో అతనిపై విమర్శలు తీవ్రం అయ్యాయి. దాంతో, అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా తెరపైకి తెచ్చారు. ఇక, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా పృథ్వీ షా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సహా ఎంతోమందిని తీర్చిదిద్దిన లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా రావడంతో సీనియర్ జట్టు రాత కూడా మారుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ద్రవిడ్ తీసుకునే నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తరచూ తుది జట్లను మార్చడం..కారణం లేకుండానే టాలెంటెడ్ ప్లేయర్లపై వేటు వేయడంతో ద్రవిడ్ కోచింగ్‌పైనా విమర్శలు వస్తున్నాయి. గాయం నుంచి కోలుకోకున్నా బుమ్రాను ఆస్ట్రేలియా టూర్‌లో ఆడించడం, పెద్ద టోర్నీల్లో లెగ్ స్పిన్నర్ చహల్‌ను ఉపయోగించుకోకపోవడం, బంగ్లాతో ఫస్ట్ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్ యాదవ్‌ను తర్వాతి మ్యాచ్ నుంచి తప్పించడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌కు సపరేట్ కోచ్‌ను నియమించే ఆలోచనతో బీసీసీఐ ఉందంటే ద్రవిడ్ ఫెయిల్యూర్‌ను ఒప్పుకున్నట్టే అనుకోవాలి.
బిన్నీపై పెద్ద బాధ్యత..
బీసీసీఐ బాస్‌గా తన మార్కు చూపెట్టిన గంగూలీకి బోర్డు పెద్దలు మరో పర్యాయం పగ్గాలు ఇవ్వకుండా షాకిచ్చారు. గంగూలీ స్థానంలో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ రోజర్ బిన్నీని కొత్త ప్రెసిడెంట్‌గా నియమించారు. సైలెంట్ కిల్లర్‌గా పనులు చక్కబెడతాడని పేరున్న బిన్నీపై చాలా బాధ్యతలే ఉన్నాయి. 2023లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌తో పాటు ఆసియాకప్, డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా కీలక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.
ఫట్టు.. హిట్టు
పెర్ఫామెన్స్ పరంగా ఈ ఏడాది ఎక్కువగా నిరుత్సాహపరిచింది కేఎల్ రాహుల్ అనొచ్చు. ఫ్యూచర్ లీడర్‌గా భావించిన అతను మూడు ఫార్మాట్లలోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా వన్డే టీమ్‌లో అతని వైస్ కెప్టెన్సీని పాండ్యాకు ఇచ్చేశారు. ఆల్‌రౌండర్‌గానే కాకుండా ఐర్లాండ్, న్యూజిలాండ్ టూర్లలో తన నాయకత్వ లక్షణాలను పాండ్యా నిరూపించుకున్నాడు. కానీ, రోహిత్ శర్మ కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ నిరాశ పరిచాడు. ఆసియా కప్‌తో కోహ్లీ గాడిలో పడగా.. వచ్చిన అవకాశాలను అందుకోవడంతో శ్రేయస్ అయ్యర్ టెస్టులతో పాటు వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. వన్డేల్లో ఈ ఏడాది ఇండియా టాప్ స్కోరర్ తనే కావడం విశేషం. షార్ట్ ఫార్మాట్‌లో సూర్యకుమార్ కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. దాంతో, అతనికి షార్ట్ ఫార్మాట్ వైస్ కెప్టెన్సీ దక్కింది. ఇక, ఓపెనర్లుగా సత్తా చాటగలమని శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ నిరూపించుకోగా.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ రూపంలో మంచి పేసర్లు దొరికారు. కొన్నాళ్లుగా వన్డేలకే పరిమితం అయిన శిఖర్ ధవన్ ఈ ఏడాది ఇండియా తరఫున సెకండ్ బెస్ట్ స్కోరర్‌గా ఉన్నా జట్టులో ప్లేస్ కోల్పోవడంతో అతని కెరీర్ ముగిసినట్టే. టెస్టుల్లో ఓ వెలుగు వెలిగిన ఇషాంత్ శర్మతో పాటు భువనేశ్వర్, దినేశ్ కార్తీక్, సాహా ఆటకూ ఎండ్ కార్డ్ పడినట్టే అనొచ్చు.