ప్రభుత్వ హామీతో నిరసన విరమించిన రైతులు

ప్రభుత్వ హామీతో నిరసన విరమించిన రైతులు

హర్యానాలో రైతులు నిరసన విరమించారు. వరి ధాన్యాన్ని త్వరగా సేకరించాలని డిమాండ్ చేస్తూ 21 గంటల పాటు జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. అయితే ప్రభుత్వం ధాన్యాన్ని త్వరగా కొంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ నిరసన కారణంగా కురుక్షేత్ర చుట్టూ ఉన్న  44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

వరి సహా ఇతర పంటల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఈ ధర్నా చేపట్టారు. వెంటనే పంట కొనుగోలు చేపట్టడంతోపాటు వరి కొనుగోలును ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ ఆరోపించారు. పంట ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సదుపాయాలు తమకు లేవని కొనుగోలు తేదీని ముందుకు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడంతో రైతులు రోడెక్కారు. ఏజెన్సీలు కొనుగోలు ఇంకా ప్రారంభించకపోవడంతో తమ పంట మగ్గిపోతుందని.. తేమశాతం పెరగడంతో అంబాలా, కైథాల్ ఇతర జిల్లాల్లోని మార్కెట్లలో వందల క్వింటాళ్ల వరి ధాన్యం నాశనమైందని రైతులు వాపోతున్నారు.