V6 News

జమ్మూకాశ్మీర్‌‌లో లోయలో పడ్డ బస్సు.. 21 మంది మృతి

జమ్మూకాశ్మీర్‌‌లో లోయలో పడ్డ బస్సు.. 21 మంది మృతి
  • జమ్మూకాశ్మీర్‌‌లోని ఉధంపూర్‌‌లో ఘటన 
  • రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి..ఎక్స్‌‌గ్రేషియా ప్రకటన

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ప్యాసింజర్లతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కొండ పైనుంచి 100 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా.. మరో 29 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రైవేట్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో ఉదయం 10 గంటలకు రామ్‌‌‌‌నగర్ నుంచి ఉధంపూర్‌‌‌‌కు బయలుదేరింది. 

రామ్‌‌‌‌నగర్ ఏరియాలోని కాగోర్ట్ గ్రామం సమీపంలో ఉన్న ఒక మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడింది. కొండ పైనుంచి వేగంగా పడిపోయిన బస్సు.. కింద రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటోను తాకి బోల్తా పడింది.అయితే, ఆటోలోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన టైంలో అదే మార్గంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. 

బస్సు పైభాగం పూర్తిగా ఊడిపోయి ఇనుప కుప్పలా మారినప్పటికీ.. ఆర్మీ జవాన్లు, స్థానిక పోలీసులు, ప్రజలు కలిసి శిథిలాల నుంచి బాధితులను బయటకు తీశారు. హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించి.. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌‌‌‌లిఫ్ట్ చేశారు. ఘటనా స్థలంలోనే 15 మంది మరణించగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో, చికిత్స పొందుతూ మరో ఆరుగురు చనిపోయారు. 

దాంతో మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. గాయపడిన మరో 29 మందికి ప్రస్తుతం ఉధంపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలేనని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ కంట్రోల్ తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

రాష్ట్రపతి, ప్రధాని  దిగ్భ్రాంతి

ఉధంపూర్ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రధాని ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని పేర్కొన్నారు.