- దీని కింద ఉన్న కాలనీలు, ఇండ్లకు మోక్షం?
- విమర్శలు తిప్పికొడుతూనే బాధితులకు ఊరటనిద్దాం
- ధరణి మాటున జరిగిన భూదోపిడీని ఎండగడదాం
- ఎల్‌నినో, తాగు నీటి ఎద్దడిపై సభలో చర్చిద్దాం
- మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 22ఏ సమస్య కొలిక్కి రానున్నది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీవోటీ) కింద అసైన్డ్ భూముల్లో వెలిసిన కాలనీలు, నివాసాలను రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22 ఏ నిషేధ జాబితాలోంచి ఎత్తివేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. బుధవారం శాసనసభలో 22 ఏపై స్వల్పకాలిక చర్చ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఎంసీహెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. 22-ఏపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే.. బాధితులకు పూర్తి ఊరట కల్పించాలని నిర్ణయించారు. దీంతోపాటు రాష్ట్రంపై పెను ప్రభావం చూపుతున్న ఎల్-నినో పరిస్థితులు, తాగు-సాగునీటి ఎద్దడిపై కూడా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉన్నందున, ఆయా అంశాలపైనా సమాలోచనలు జరిపారు.
రంగారెడ్డి జిల్లా రామదాస్‌పల్లితోపాటు గ్రేటర్ పరిధిలోని పలు కీలక ప్రాంతాల భూములను 22-ఏ నుంచి తప్పించేందుకు మార్గం సుగమమవుతున్నది. ఇబ్రహీంపట్నం మండలం రామదాస్‌పల్లి సర్వే నంబర్ 41లోని మొత్తం 1,271.27 ఎకరాల్లో కేవలం 106.37 ఎకరాలు మాత్రమే సీలింగ్, కోర్టు వివాదాల్లో ఉండగా, మిగిలిన 1,164.30 ఎకరాల పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించేందుకు ఇప్పటికే ఆర్డీవోకు నివేదిక వెళ్లింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించనున్నది. అలాగే, ‘సీఎస్-14’ వివాదం కారణంగా సుప్రీంకోర్టు కేసుల పేరుతో 2013 నుంచి పీవోబీలో నలుగుతున్న హైదర్‌నగర్ సర్వే నంబర్లు 145 (220.18 ఎకరాలు), 163 (175.06 ఎకరాలు), 172 (196.20 ఎకరాలు)లలోని సీబీసీఐడీ, వసంతనగర్, భగత్‌సింగ్‌నగర్, పటేల్‌నగర్, దుర్గామాత సొసైటీ, త్రివేణి, జయనగర్ కాలనీల ప్రజలకు ఊరట దక్కే అవకాశముంది. వీటితోపాటు శంషాగూడ సర్వే నం. 57లోని 274.33 ఎకరాల్లో ఉన్న జన్మభూమి, ఇందిరాహిల్స్, వివేకానంద నగర్ కాలనీని కూడా కోర్టు వివాదాల నుంచి వేరుచేసి, నివాసితులకు 22-ఏ నుంచి శాశ్వత మినహాయింపునిచ్చే దిశగా ప్రభుత్వం ప్రకటన చేసే వీలుంది.
ఏండ్లకొద్దీ 22ఏలో ఉన్న భూములకు మోక్షం
మరోవైపు ఏళ్ల తరబడి వివాదాల్లో ఉండిపోయిన ఫరూక్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, రామచంద్రాపురం మండలాల భూములకు కూడా 22-ఏ నుంచి మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట సర్వే నం. 191, 193లలోని 25.15 ఎకరాల భూమి 2007 నుంచే నిషేధిత జాబితాలో ఉండగా, గతంలో హెచ్ఎండీఏ లేఅవుట్ అనుమతులు పొందిన ప్లాట్ల యజమానులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. అబ్దుల్లాపూర్‌మెట్ పిగ్లిపూర్ సర్వే నం. 17లోని 386 ఎకరాల్లో 2007 నుంచి ఆంక్షల్లో ఉన్న 189 ఎకరాల భూముల్లో ఎంజీవై కన్‌స్ట్రక్షన్స్‌లాంటి నిర్మాణాలకు, సాధారణ పట్టాదారులకు 22-ఏ నుంచి విముక్తి కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు సర్వే నం. 191లోని 143 ఎకరాలు, ఉస్మాన్‌సాగర్ సర్వే నం. 30లోని 93 ఎకరాల మాజీ సైనికుల భూముల్లో నిబంధనల ప్రకారం ఎన్‌వోసీలు జారీ చేసి, అక్కడ వెలిసిన బీహెచ్‌ఈఎల్ సొసైటీ, ఎస్ఎస్‌పీడీఎల్ లేఅవుట్లలోని గృహ నిర్మాణాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఒకే విడతలో వేలాది నివాసాలను తప్పిస్తూ ప్రకటించే చాన్స్
హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఏళ్ల తరబడి ఇండ్లు కట్టుకొని ఉంటున్న వేలాది నివాసాలను ఒకే విడతలో 22-ఏ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని దేవేందర్ నగర్ (1,080 ఇళ్లు), బీజేఆర్ నగర్ (1,623), గణేష్ నగర్ (1,000), రేణుకా నగర్, కాకతీయ నగర్ సహా 18 కాలనీల్లోని 5,118 నివాసాలు, జైపురి, కనకదుర్గా నగర్లతో కలిపి మొత్తం 10,395 ఇండ్లను ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి తొలగించే వీలుంది. అలాగే ఉప్పల్, కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రథమపురి, చిల్కానగర్, పద్మానగర్, సుభాష్ నగర్ తదితర యూఎల్‌సీ కాలనీల్లోని 4,536 గృహాలకు పూర్తిస్థాయిలో 22-ఏ నుంచి మినహాయింపు లభించనున్నది. శేరిలింగంపల్లి అయ్యప్ప కాలనీలోని 2,776 ఇండ్లు, రాజరాజేశ్వరి, మాధవ హిల్స్, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లోని మరో 5,080 పీవోబీ ఇండ్లతోపాటు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బీహెచ్‌ఈఎల్, సందిగూడెం, బోన్సాయి తదితర కాలనీల్లోని 2,117 నివాసాలకు 22-ఏ నుంచి విముక్తి కల్పించి, క్రయవిక్రయాలకు పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు తెలుస్తున్నది.
సెట్‌కు బీఆర్ఎస్ పెద్దల చిట్టా
ధరణి పోర్టల్ ముసుగులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాను సీఎం సభలో ప్రస్తావించనున్నారని సమాచారం. వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను అర్ధాంతరంగా రద్దు చేయడం వెనుక ఉన్న మతలబు, విదేశీ ప్రైవేట్ సంస్థ 'టెర్రాసిస్'కు పోర్టల్ బ్యాక్-ఎండ్ అప్పగించి రికార్డులను తారుమారు చేసిన తీరునూ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ధరణి పేరుతో బీఆర్ఎస్ పెద్దలు కొల్లగొట్టిన భూముల వివరాలను స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్)కు అప్పగించనున్నట్టు సమాచారం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది.
