నిజామాబాద్‌లో 23 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

నిజామాబాద్‌లో 23 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

నిజామాబాద్: హైకోర్టు సూచన మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు. కార్మికులు 52 రోజుల తర్వాత ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. సమ్మెపై లేబర్ కోర్టు నిర్ణయం వచ్చే వరకు కార్మికులు ఆగాలని ఆర్టీసీ ఎండీ సనీల్ శర్మ చెప్పారు. అయినా సరే కార్మికులు మాత్రం విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వస్తూనే ఉన్నారు. దాంతో డిపోలన్నింటి దగ్గర పోలీసులు పహరా కాస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 23 మంది ఆర్టీసీ కార్మికులను ముందస్తు అరెస్టు చేశారు. నిజామాబాద్ బస్టాండ్‌కు నలువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఎస్సై స్థాయి అధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. డిపోల వద్ద సిటీ యాక్ట్ అమలు చేస్తున్నారు. డిపోలు మరియు బస్టాండ్‌ల వద్ద నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఆర్టీసీ కార్మికులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. బస్సులను లేదా తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలున్నాయి. వాటిలో దాదాపు 3200 మంది కార్మికులు పనిచేస్తున్నారు.