Killer Movie Tragedy: SJ సూర్య మూవీ సెట్స్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

Killer Movie Tragedy: SJ సూర్య మూవీ సెట్స్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య తెరకెక్కిస్తూ, నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిల్లర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఇవాళ జూన్ 3న షూటింగ్ స్పాట్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

గత కొన్ని రోజులుగా ‘కిల్లర్’ సినిమా షూటింగ్ చెన్నై ఒటేరిలోని బి & సి మిల్ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో వంద మందికి పైగా టెక్నీషియన్స్, సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గ్యాస్ బెలూన్ సిలిండర్ పేలిపోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో మధురవాయల్‌కు చెందిన టెక్నీషియన్ మదన్ (26) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే కుంద్రత్తూర్‌కు చెందిన శక్తివేల్ (27), మధురవాయల్‌కు చెందిన సూర్య (23), నెర్కుంద్రం ప్రాంతానికి చెందిన దినకరన్ (24) గాయపడ్డారు.

ఈ క్రమంలో తోటినటులు వెంటనే వారిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికు తరలించారు. అక్కడ వైద్యులు మదన్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించగా, గాయపడిన మిగతా ముగ్గురికి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై ఒటేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అనూహ్య ఘటనతో నటుడు SJ సూర్య షాక్ లో ఉన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండగా, ఇలాంటి ప్రమాదం జరగడంతో కిల్లర్ చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది.