2024లో ఇండియాలో 260 డోపింగ్ కేసులు.. దేశ చరిత్రలోనే అత్యధిక కేసులతో రికార్డు

2024లో ఇండియాలో 260 డోపింగ్ కేసులు.. దేశ చరిత్రలోనే అత్యధిక కేసులతో రికార్డు

న్యూఢిల్లీ: ఇండియాలో  డోపింగ్ కేసులు భారీగా పెరిగాయి. 2024లో నిర్వహించిన 7,466 పరీక్షల్లో ఏకంగా 260 మంది అథ్లెట్లు పాజిటివ్‌‌గా పట్టుబడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక సంఖ్యగా రికార్డు అయింది. గతంలో 2019లో నమోదైన 224 కేసులే ఇప్పటివరకు అత్యధికం. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 2023 నివేదిక ప్రకారం ఇండియా 213 కేసులతో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ లెక్కలను సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించింది. 

ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌‌గఢీ అడిగిన ప్రశ్నకు స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ బదులిస్తూ.. క్రీడల్లో డోపింగ్‌‌ను అరికట్టడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. కాగా, డోపింగ్ కేసుల్లో అథ్లెటిక్స్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2023లో నిర్వహించిన టెస్టుల్లో అథ్లెటిక్స్‌‌లో 61 పాజిటివ్ కేసులు నమోదవగా.. 2024లో ఆ సంఖ్య 76కు పెరిగింది. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌‌లో 43 కేసులు వెలుగు చూశాయి.  రెజ్లింగ్‌‌లో 29 మంది, బాక్సింగ్‌‌లో 17 మంది డోపీలుగా తేలారు.