హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానానికి పెట్టింది పేరైన ఫిన్లాండ్ దేశానికి టీచర్లను పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. 'టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్' ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి విడతలో 28 మంది టీచర్లను అధికారులను ఎంపిక చేశారు.
తొలి విడతలో మొత్తం 40 మంది ఫిన్లాండ్ వెళ్లనుండగా..వీరిలో 28 మంది టీచర్లు, మిగిలిన 12 మంది పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు ఉంటారు. టీచర్ల జాబితాలో ఇద్దరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, నలుగురు హెడ్మాస్టర్లు, 9 మంది స్కూల్ అసిస్టెంట్లు, 12 మంది ఎస్జీటీలు ఉన్నారు. అధికారుల పేర్లను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. ఈ పర్యటన ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు సాగనుంది.
