జూన్ 18 నుంచి భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ 

జూన్ 18 నుంచి భారీ వర్షాలు.. తెలంగాణకు  ఎల్లో అలర్ట్ 

 

  • రుతుపవనాల విస్తరణకు నాలుగైదు రోజులు పడుతుందని వెల్లడి
  • తగ్గినట్టే తగ్గి మళ్లీ రెండు డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడుతాయని, ఈ నెల 18 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 18 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్తాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్​ సిటీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. రాష్ట్రమంతా విస్తరించేందుకు మరో నాలుగైదు రోజులు పడుతుందని ఐఎండీ తెలిపింది.

ఆదివారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. వికారాబాద్, నల్గొండ, మహబూబ్​నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్​కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దల్లి, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్​ జిల్లా నవాబ్‌‌‌‌‌‌‌‌పేటలో 4.6 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా పాలచెట్టు 4.3, ములుగు జిల్లా మేడారంలో 3.9, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.7, నిర్మల్ జిల్లా సాయినగర్​లో 3.5, నల్గొండ జిల్లా పులిచర్లలో 3.1, రంగారెడ్డి జిల్లా కాసులాబాద్‌‌‌‌‌‌‌‌లో 3.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా తగ్గినట్టే తగ్గి మళ్లీ రెండు డిగ్రీల మేర పెరిగాయి. శనివారం 40 డిగ్రీల రేంజ్‌‌‌‌‌‌‌‌లో నమోదైన టెంపరేచర్లు.. ఆదివారం 42 డిగ్రీలకు పెరిగాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 42.1, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 41.8, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 41.6, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 41.1, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 41, కరీంనగర్ జిల్లా వెదురుగట్టులో 41, ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌‌‌‌‌‌‌‌లో 40.8, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 40.7, కామారెడ్డి జిల్లా మేనూరులో 40.5, హనుమకొండ జిల్లా నడికుడలో 40.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.

అత్యల్పంగా నాగర్​కర్నూల్​ జిల్లా ఊర్కొండలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలో 33 డిగ్రీలు, మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో 34 డిగ్రీలు, మహబూబాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో 35 డిగ్రీల మేర రికార్డయ్యాయి.