- దశల వారీగా బ్రేక్ ఫాస్ట్.. టెన్త్ వరకూ వర్క్ బుక్కుల పంపిణీ
- ఈసారి మరో 2,769 బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’
- జులై నుంచి 8,522 హైస్కూళ్లలో ఏఐ పాఠాలు
- 5,451 బడులు ‘కాంపిటెంట్ స్కూల్స్’గా ఎంపిక
హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సుమారు 62 లక్షలకు పైగా విద్యార్థులు సెలవులకు వీడ్కోలు పలికి బడిబాట పట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం సర్కారు బడులను కేవలం చదువు చెప్పే కేంద్రాలుగానే కాకుండా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వేదికలుగా మార్చేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. గవర్నమెంట్ స్కూళ్లలో ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్, అటు న్యూట్రిషన్ ఫుడ్ లక్ష్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్సరికొత్త ప్రణాళికలను అమలు చేయబోతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల స్కూళ్లలో దాదాపు 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతిఏటా జూన్ 12 నుంచే స్కూళ్లు రీఓపెన్ అవుతుండగా, ఈ ఏడాది మాత్రం జూన్ 15 నుంచి మొదలవుతున్నాయి. వాస్తవానికి సోమవారం అమావాస్య ఉన్నందున, పలు ప్రైవేటు స్కూళ్లు 17 నుంచి రీఓపెన్ అవుతామని ప్రకటించాయి. ఈ నెల 15, 16 తేదీల్లో పాఠశాలలకు వచ్చి పుస్తకాలు, యూనిఫారాలు తీసుకెళ్లాలని పేరెంట్స్ కు మెసేజ్ పంపించాయి. అయితే, సర్కారు బడులన్నీ సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. తొలిరోజే పాఠ్యపుస్తకాలతో పాటు వర్క్ బుక్కులనూ విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్లను కనీసం పది శాతం పెంచాలని టార్గెట్ పెట్టుకున్నది. మరోపక్క, రాష్ట్రవ్యాప్తంగా 2,769 బడుల్లో కొత్తగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తోంది. చిన్నారులను ఆకర్షించేలా తరగతి గదులను ప్లే స్కూల్స్ తరహాలో తీర్చిదిద్దారు. గోడలపై వర్ణమాల, జంతువులు, పక్షుల చిత్రాలను రంగురంగుల్లో పెయింటింగ్ వేయించారు. పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునేలా బొమ్మలను అందుబాటులో ఉంచారు.
టిఫిన్‌తో పాటు పాలు, రాగిజావా
విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమును ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. దీన్ని దశలవారీగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. తొలి విడతలో కిచెన్ షెడ్లు అందుబాటులో ఉన్న 8 జిల్లాల పరిధిలోని 1,269 బడుల్లో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం కానుంది. ఈసారి మెనూలో కీలక మార్పులు చేశారు. ప్రతిరోజూ అందించే టిఫిన్‌తో పాటు వారానికి మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు ఐరన్, కాల్షియం అధికంగా ఉండే రాగిజావాను అందించనున్నారు. దీనికోసం ఇప్పటికే మిల్లెట్ పౌడర్, బెల్లం సరఫరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
హైస్కూల్ వరకూ వర్క్ బుక్కులు
కొవిడ్ తర్వాత విద్యార్థుల్లో పెరిగిన లెర్నింగ్ గ్యాప్స్‌ను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది మొత్తం ప్రైమరీ స్కూళ్లలో 5,451 బడులను కాంపిటెంట్ స్కూల్స్‌గా ఎంపిక చేసి, అక్కడ విద్యార్థులకు కనీస చదవడం, రాయడం సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. ప్రతి క్లస్టర్‌లో అత్యధిక స్ట్రెంత్ ఉన్న మూడు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ బడుల్లో ఈ ప్రోగ్రామ్ అమలు చేయబోతున్నారు. మరోపక్క, ఇప్పటివరకు ప్రైమరీ స్థాయి వరకే పరిమితమైన వర్క్ బుక్కులను ఈసారి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు. దీనివల్ల మరో 1v2 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
హైస్కూళ్లలో ‘ఏఐ’ మంత్రం!
టెక్నికల్ ఎడ్యుకేషన్ పైనా విద్యార్థుల్లో అవగాహన పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది నుంచే విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా మార్చేందుకు 8,522 హైస్కూళ్లలో జులై నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాఠాలను ప్రవేశపెడుతున్నారు. దీనికోసం ప్రత్యేక సంస్థల సహకారంతో కోర్సులను రూపొందించారు. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ గైడెన్స్ ఇచ్చేందుకు ‘అన్న అక్క మెంటర్ షిప్’ స్కీమ్ అమలు చేస్తున్నారు. దీనికోసం డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదువుతున్న 39,828 మంది విద్యార్థులను మెంటర్లుగా ఎంపిక చేశారు. వీరు స్కూళ్లకు వెళ్లి జులై నుంచి విద్యార్థులకు టెక్నాలజీపై మెళకువలు నేర్పిస్తారు. మరోపక్క క్యూర్ పరిధిలోని పలు స్కూళ్లను ఇంటిగ్రేటెడ్ బడులుగా అప్‌గ్రేడ్ చేయగా.. మరికొన్ని కొత్త స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
స్టూడెంట్ల రాకకు స్కూళ్లు ముస్తాబు
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. దీంతో స్టూడెంట్లకు స్వాగతం పలికేందుకు టీచర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను హెచ్‌ఎం గణపతి, టీచర్లు శ్రీనివాస్, మహేశ్ కలిసి క్లీన్ చేయించారు. ఆదివారం స్కూల్ బిల్డింగ్ భాగంలో అందమైన పెయింటింగ్స్ వేయించారు. స్కూల్ ఎంట్రెన్స్‌లో బెలూన్లు కట్టి స్టూడెంట్లకు స్వాగతం పలికేందుకు ముస్తాబు చేశారు.
- ఆసిఫాబాద్, వెలుగు
