దళితుల కోసం : మూడెకరాల భూమి పంపిణీ స్కీంపై ప్రభుత్వంలో కదలిక

దళితుల కోసం : మూడెకరాల భూమి పంపిణీ స్కీంపై ప్రభుత్వంలో కదలిక

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలోని దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేసే స్కీమ్​లో కదలిక వచ్చింది. ఎకరం రెండెకరాలు కాకుండా.. ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం బహిరంగ ప్రకటనలు జారీ చేయాలని ఇటీవలే అన్ని జిల్లాల సోషల్​వెల్ఫేర్​ఈడీలను ఆదేశించింది. రేటు ప్రస్తావన ఎక్కడా తేకుండా ముందుగా భూములు అమ్మేవాళ్ల వివరాలు సేకరించాలని సూచించింది. ఆయా జిల్లాల్లో భూముల లభ్యతను బట్టి టార్గెట్​విధించింది. హైదరాబాద్​ను ఆనుకుని ఉన్న జిల్లాలో ఒకరకంగా, ఆదిలాబాద్​లాంటి జిల్లాలో మరో రకంగా భూములు సేకరించేందుకు గడువు విధించింది. పాత జిల్లాలను ప్రామాణికంగా తీసుకునే భూములు సేకరించాలని తాజాగా అధికారులకు ఆదేశాలు అందాయి.

మార్చి నాటికి భూసేకరణ

హైదరాబాద్​ను ఆనుకుని ఉన్న నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 250 ఎకరాలకు తగ్గకుండా, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్​జిల్లాల్లో 500 ఎకరాల వరకు భూములు సేకరించనున్నారు. అన్ని జిల్లాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి భూముల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ రేటు ప్రస్తావన తీసుకురాకుండా ముందుగా భూములు అమ్మేవాళ్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఏ ప్రాంతంలో ఏ రేటుకు ఎంత భూమి లభిస్తుందో పరిశీలించాక దాన్ని బట్టి జిల్లా జాయింట్​కలెక్టర్​ నేతృత్వంలో ధరలు ఖరారు చేస్తారు. జిల్లా కమిటీ నిర్ణయించిన భూముల ధరల వివరాలను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత లబ్ధిదారులకు పంపిణీ మొదలుపెడతారు. మౌఖికంగా తమకు అందిన ఆదేశాల ప్రకారం ఎకరానికి రూ.10 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్​ వెల్ఫేర్​అధికారులు ధ్రువీకరించారు.

మారుమూల మండలాలపై ఫోకస్

అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాల్లో భూముల సేకరణకు ఇబ్బంది ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ జిల్లాల్లో ఎకరం భూమి రూ.10 లక్షలకైనా దొరుకుతుందేమో గానీ, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కష్టమని అంటున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో సాగుయోగ్యమైన భూములను అమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే మారుమూల ప్రాంతాల్లో సర్వే చేయాలని అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో చండూరు, అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో, దామరచర్ల ప్రాంతాల్లో సర్వే చేశామని, అక్కడ ఎకరం భూమి సుమారు రూ.8 లక్షలు పలుకుతోందని జిల్లా అధికారులు
వెల్లడించారు.