పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. మిగిలింది కేవలం నెల రోజులే! అందరూ ఈ ఒక్క సంవత్సరం ఫలితాలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని నమ్ముతారు. అందుకే ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్ టెన్షన్‌కు గురవుతుంటారు. కానీ, భయపడాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన ఫుడ్, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్‌తో ఎవరైనా మంచి మార్కులు సాధించవచ్చు. ఈ కీలక సమయంలో బాగా చదువుకుని, అధిక మార్కులు పొందడానికి సహాయపడే పది ముఖ్యమైన సూత్రాలు ఇవి..
సరైన ప్లానింగ్
విద్యార్థులు చక్కటి ప్లాన్ వేసుకొని పాఠాల వారీగా అన్ని విషయాలు శ్రద్ధగా చదవాలి. కనీసం రెండు మూడు గెస్ పేపర్లు తయారు చేసుకొని సమాధానాలు రాయాలి. క్వశ్చన్ బ్యాంక్‌లోని చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు, ఖాళీలు, మల్టిపుల్ ప్రశ్నలు ప్రణాళిక ప్రకారంగా చదవాలి. ప్రతినిత్యం ఆరు సబ్జెక్టులు తప్పనిసరిగా చదవాలి. యూనిట్ టెస్ట్‌లు త్రైమాసిక, అర్ధవార్షిక, ప్రీ- ఫైనల్ పరీక్షల్లో సమాధాన పత్రాలను పరిశీలించి చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి 10 గంటల వరకు టైంటేబుల్ తయారు చేసుకోవాలి. ఒక హార్డ్ సబ్జెక్ట్ తర్వాత ఒక ఈజీ సబ్జెక్ట్ రెండేసి గంటలు చదవాలి.
సమతుల ఆహారం
చిరు తిండ్లు మానుకోవాలి. మసాలలాతో కూడిన పదార్థాలను తగ్గించాలి. మటన్, చికెన్, తినేవారు మధ్యాహ్నం పూట తక్కువ మోతాదులో తినాలి. తేలికపాటి ఆహారం ఇడ్లి, ఉప్మా, ఉదయం, మధ్యాహ్నం వైట్ రైస్, ఆకుకూరలు, పప్పు, రసం, పెరుగు, రాత్రి మజ్జిగ అన్నం, రసం తక్కువ మోతాదులో తినాలి. ఎక్కువ తింటే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. పండ్ల జ్యూస్ తాగాలి. రోజుకోసారి కొబ్బరినీళ్లు తాగాలి. కోడిగుడ్డు, చేపలు, పెద్ద ఉసిరికాయలు, ఎండు ద్రాక్షలు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాజు, బాదాం, నానబెట్టిన శనగలు, పిస్తా పలుకులు ఆరోగ్యానికి మంచివి. నూనెలో వేయించినవి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఫుడ్, పుట్‌పాత్‌లపై అమ్మే శ్నాక్స్ తినడం మంచిది కాదు.
సరిపడా నిద్ర
ప్రతి విద్యార్థికి ఆరు గంటల నిద్ర తప్పనిసరి. కొంతమంది స్టూడెంట్స్ పరీక్షల సమయంలో రాత్రంతా చదివి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉంటే ఆ ప్రభావం పరీక్షపై పడి సరిగ్గా రాయలేకపోతారు. అందుకే సరైన టైంకి పడుకుని, ఉదయాన్నే లేచే అలవాటు చేసుకోవాలి. కొంతమందికి రాత్రి చదివితే బాగా అబ్బుతుంది. కొంతమందికి ఉదయం చదివితే బాగా జ్ఞాపకం ఉంటుందంటారు. వారి వారి ఇష్ట ప్రకారం చదువుకోవచ్చు.
ఆరోగ్యమే మహా భాగ్యం
పదో తరగతి విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండాకాలం మొదలైంది. కాబట్టి వడదెబ్బ తాకకుండా జాగ్రత్తపడాలి. సరిపడా నీళ్లు తాగాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్ష నుంచి వచ్చేటప్పుడు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలకు టోపి పెట్టుకోవాలి. లేదా గొడుగు వాడాలి.
అన్నీ సమకూర్చుకోవాలి
హాల్ టికెట్ నుంచి పెన్సిల్, రబ్బర్, పెన్నులు.. ఇలా అన్నీ సమకూర్చుకోవాలి. స్కెచ్ పెన్నులు, స్కేల్, షార్ప్‌నర్, ప్యాడ్, జామెట్రీ బాక్స్ కొని, జాగ్రత్తగా దాచుకోవాలి. దానివల్ల ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
పరీక్షలకు ఇలా వెళ్లాలి
ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్ ఎంత దూరం ఉందో ముందే తెలుసుకోవాలి. సైకిల్‌పై వెళ్లేవాళ్లు ఎంతసేపు పడుతుంది. బస్సుకెళ్తే పట్టే సమయం ఎంత? బండిమీద ఎవరు దించుతారు? ఆటోలో వెళ్తే డ్రైవర్ సరైన టైంకి చేరుస్తాడా? లేదా?.. ఇలాంటవన్నీ ముందే చూసుకోవాలి. ఎలాగైనా పరీక్ష హాలులోకి పదిహేను నిమిషాల ముందుగానే పంపిస్తారు కాబట్టి సెంటర్‌కు కనీసం అరగంట ముందే చేరేలా ప్లాన్ చేసుకోవాలి.
పరీక్ష హాల్లో ఏం చేయాలి ?
హాల్లోకి వెళ్లగానే రెండు నిమిషాలు ధ్యానం చేయాలి. గ్లాసు నీళ్లు తాగి చుట్టు పక్కల ఎలాంటి కాగితాలు, చీటీలు లేకుండా చూసుకోవాలి. ఇన్విజిలేటర్ సూచించిన విధంగా ఆన్సర్ పేపర్స్‌లో సంతకం చేసి, సబ్జెక్ట్, తేది రాయాలి. మార్జిన్లు గీసి పెట్టుకోవాలి. ఇతరులతో మాట్లాడకుండా చదివినదంతా నెమరు వేసుకోవాలి. ముందుగా తెలిసిన జవాబులు అందంగా రాయాలి. సమయం వృథా చేయకూడదు. పేజీ నెంబర్లు వేయాలి. స్క్వాడ్ వస్తే భయపడొద్దు. రెండు గంటల్లోనే మెయిన్ పేపర్ పూర్తి చేసి, ఆబ్జెక్టివ్ కోసం వేచిచూడాలి. ఒకటికి రెండుసార్లు అక్షర దోషాలు లేకుండా జవాబులను సరిచూసుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల్లో ఖాళీ వదలకూడదు. కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. సమయం దగ్గర పడుతుందనే టెన్షన్ పడొద్దు.
ఎలా రాయాలి ?
తెలుగులోని అన్ని అక్షరాలు గుండ్రంగా సమానంగా రాయాలి. తలకట్టు ఒకేలాగా గుడి, గుడి దీర్ఘాలు పెద్దగా చిన్నగా కాకుండా సరిపడే విధంగా రాయాలి. అచ్చుల గుర్తులు పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా ఇవ్వాలి. ఒత్తులు అక్షరం కంటే చిన్నగా ఉండాలి. ఇంగ్లిష్‌లో బి,డి, ఎఫ్, హెచ్, కె, ఎల్, టి అక్షరాలు పై రెండు గీతల్లో రాయాలి. ఎ, సి, ఇ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్ మధ్య డబ్బాలో జి, జె, పి, క్యూ, వై, జెడ్ అక్షరాలు కింది రెండు గీతల్లో కుడివైపు వాల్చినట్లు రాయాలి. క్యాపిటల్ లెటర్స్ అందంగా పెద్దగా రాయాలి.
హెడ్డింగ్స్‌కు అండర్ లైన్ చేయాలి. పదానికి పదానికి మధ్య, పేరాగ్రాఫ్‌ల మధ్య సమానమైన స్థలం వదలాలి. పుల్ స్టాప్‌లు, కామాలు తప్పనిసరిగా పెట్టాలి. ఒక పేజీలో పదహారు లైన్లు రాయాలి. ఫుల్ స్టాప్ తర్వాత మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ రాయాలి. హిందీ అయితే అన్ని నిలువు గీతలు సమానంగా రాయాలి. శిరోరేఖ సమానంగా పదానికి అటు ఇటు వచ్చేలాగా రాయాలి. లెక్కల్లో అంకెలు సమానంగా వేయాలి. గణిత గుర్తులు అందంగా రాయాలి. సోషల్‌లో మ్యాప్ పాయింటింగ్ అక్షరాలు అందంగా రాయాలి. సైన్స్ పటాలు ఆకర్షణీయంగా వేసి భాగాలు ఓ పక్క బాణం గుర్తులు గీసి రాయాలి.
సమానంగా కట్టాలి
జవాబు పత్రాలను ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్ పేపర్ చివర పెట్టి అన్నీ సమానంగా జమాయించి ఎడమవైపు మూలలో దారంతో సరిగ్గా ముళ్లు వేసి కట్టాలి. రెండు పేజీల్లో ఒకే సమాధానం రాస్తే ఉల్టాపల్టా కట్టరాదు.
పరీక్ష తర్వాత చర్చ
పరీక్ష అయిపోయిన తర్వాత హాల్ బయటకొచ్చి ఆన్సర్లపై విద్యార్థులతో చర్చిస్తుంటారు. ఏదైనా జవాబు రాయకపోతే బాధపడుతుంటారు. కానీ.. దాని ప్రభావం మరుసటి రోజు ఎగ్జామ్‌పై పడుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు పక్కపెట్టి మరుసటి రోజు ఎగ్జామ్ మీద దృష్టి పెట్టాలి.
క్యాతం అశోక్
టీజీటీ సోషల్ టీచర్, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ 9949353941
NOTE: లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
