శనివారం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్ అనేక మిడిల్ ఈస్ట్ దేశాల్లోని యూఎస్ మిలిటరీ స్థావరాలపై దాడులు స్టార్ట్ చేయటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ ప్రభావం సోమవారం భారత స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. మార్కెట్లు స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనే బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది.
ఉదయం 9.48 గంటల సమయంలో మార్కెట్ సూచీ సెన్సెక్స్ 735 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 225 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 475 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 390 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయటంతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లలో పెరగటం స్టార్ట్ చేశాయి.
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి దారితీసిన ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లను ఏఏ అంశాలు కలవరానికి గురిచేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. క్రూడాయిల్ ధరల పెరుగుదల:
ఇరాన్ ప్రతీకార చర్యలతో పాటు, ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు టెహ్రాన్ ప్రకటించడం మార్కెట్లను భయపెట్టింది. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 7% పెరిగి, 14 నెలల గరిష్ట స్థాయి 82.40 డాలర్లకు చేరింది. ఫలితంగా పెయింట్, టైర్, ఏవియేషన్, కెమికల్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి.
2. రూపాయి విలువ పతనం - FIIల అమ్మకాలు:
మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడింది. దీనివల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 27న ఒక్కరోజే వీరు సుమారు రూ.7వేల 536.4 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.
3. పెరుగుతున్న అస్థిరత:
మార్కెట్ భయాన్ని సూచించే India VIX సూచీ ఒక్కసారిగా 15% పెరిగి 15.78 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం కారణంగా మున్ముందు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మదుపరులలో స్పష్టంగా కనిపిస్తోంది.
భయాందోళనతో షేర్లను విక్రయించడం సరైన పద్ధతి కాదన్నారు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్. గతంలో కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ మార్కెట్లు ఇలాగే స్పందించినా, ఆరు నెలల తర్వాత మళ్లీ కోలుకున్నాయి. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉంటూ.. బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడానికి ఈ మార్కెట్ పతనాన్ని అవకాశంగా మార్చుకోవాలని సూచించారు.
