అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్ట్.. దేశ బహిష్కరణ వేటు!

అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్ట్.. దేశ బహిష్కరణ వేటు!

అమెరికాలో అక్రమంగా ఉంటున్నారంటూ 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అరిజోనాలోని యూమా సెక్టార్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్  చెక్ మేట్ పేరుతో అరిజోనాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు  తనిఖీలు చేసి మొత్తం 52 మంది ట్రక్కు డ్రైవర్లను అరెస్ట్ చేయగా వారిలో 30 మంది భారతీయులున్నారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం వీరిని త్వరలో దేశంనుంచి పంపించే అవకాశం కనిపిస్తోంది. 

అరిజోనాలోని యూమా సెక్టార్ లో మే 11నుంచి మే 15 వరకు ఆపరేషన్ చెక్ మేట్ పేరుతో తనిఖీలు చేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. ఈ తనిఖీల్లో 52మందిని అదుపులోకితీసుకున్నారు. వారిలో 36 మంది చట్టవిరుద్దంగా అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో 30 మంది భారతీయులేనని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు తెలిపారు. మిగతా వారు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశాలకు చెందినవారని తెలిపారు. 

కొంతమంది డ్రైవర్ల వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి రాష్ట్రాలు జారీ చేసిన కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు ఉన్నప్పటికీ, మరికొందరికి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేవని గుర్తించారు. వీరిలో కొంతమందికి బైడెన్ పాలన సమయంలో జారీ చేసిన అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ, అవి ప్రస్తుతం చెల్లుబాటులో లేవని అధికారులు స్పష్టం చేశారు.

అక్రమ వలసలను నియంత్రించడం, రహదారి భద్రతను పెంపొందించడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు బోర్డర్ పెట్రోల్ అధికారులు తెలిపారు. అరెస్టైన వారిపై ఫెడరల్ చట్టాల ప్రకారం విచారణ జరిపి, అనంతరం దేశ బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.