ప్రజావాణికి 30 వేల దరఖాస్తులు

ప్రజావాణికి 30 వేల దరఖాస్తులు
  • సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్ తలుపుతట్టిన ప్రజలు
  • ఇండ్లు కావాలని14 వేల అర్జీలు
  • భూ కబ్జా ఫిర్యాదులూ ఎక్కువే
  • వివరాలు వెల్లడించిన ప్రజావాణి నోడల్ ఆఫీసర్  

ప్రజాభవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటివరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇండ్ల కోసం 14 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

పంజాగుట్ట, వెలుగు:  బేగంపేటలోని జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటివరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్​ వెల్లడించారు. అందులో ఇండ్ల కోసం14 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. భూ కబ్జాలకు సంబంధించి కూడా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజావాణికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో 1,500 నుంచి 2 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి 1,483 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల కోసం ఒక సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేశామన్నారు. ప్రతి అప్లికేషన్ ను సంబంధిత కలెక్టర్లకు, అధికారులకు పంపుతున్నామన్నారు. పాలసీ పరమైన ఇబ్బందులు, తీవ్ర సమస్యలు ఉంటే పరిష్కారానికి కొంత సమయం పడుతుందన్నారు.

దరఖాస్తులు, అర్జీలు ఇచ్చిన వారు అధైర్యపడొద్దని, అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామన్నారు. కాగా, విద్యాశాఖ నుంచి తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని యూనిఫారాలు తయారీ చేసే టైలర్లు శుక్రవారం బ్యానర్లను ప్రదర్శించారు. ‘‘2023-–24 సంవత్సరానికి గాను విద్యార్థుల కోసం 32 జిల్లాలకు చెందిన టైలర్లు 58 లక్షల యూనిఫారాలు కుట్టి ప్రభుత్వానికి అందజేశారు. కానీ గత ప్రభుత్వం కుట్టు కూలీ బిల్లులు ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని బకాయిలు విడులయ్యేలా చూడాలి” అని టైలర్స్ అసోసియేషన్ కోరింది. అలాగే 317 జీవోను రద్దు చేసి తమను యధాస్థానానికి తేవాలని కోరుతూ స్టాఫ్ నర్సులు కోరారు. సుమారు నాలుగు వేల మందిని వైద్య విధాన పరిషత్ ఇతర జిల్లాలకు పంపిందని.. దీనిపై సీఎం చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని విన్నవించారు.