- ఒక్కరోజులోనే 40 శాతం పెరుగుదల
- మహారాష్ట్రలో 63 శాతం
- దేశవ్యాప్తంగా 13,509 యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: కరోనా మళ్లీ మోపైతున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గత 24 గంటల్లో 3,016 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. అంతకుముందు రోజుతో పోలిస్తే 40% పెరిగినట్లు తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 2.7%, వీక్లీ పాజిటివిటీ రేటు 1.7% ఉన్నట్లు వివరించింది. తాజా కేసులు.. గత ఆర్నెల్లలో అత్యధికమని ఆరోగ్య శాఖ చెప్పింది. చివరిసారిగా అక్టోబర్ 2న 3,375 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక గత 24 గంటల్లో 14 మరణాలు (కేరళలో 8 పాత డెత్స్ కలిపారు) నమోదయ్యాయి. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,509కు పెరిగాయి.
ఢిల్లీ, మహారాష్ట్రలో భారీ పెరుగుదల
జనవరి 16న ఢిల్లీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, బుధవారం ఒక్కరోజే 300 నమోదయ్యాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు పెట్టుకుని ఆసుపత్రులకు వెళ్లాలని ఢిల్లీ సర్కారు సూచించింది. మహారాష్ట్రలోని ముంబై, పుణె, థానె, రాయ్‌గఢ్, నాసిక్, సాంగ్లి తదితర జిల్లాల్లో కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఒక్కరోజే 694 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 63% పెరిగాయి.
