IND vs PAK: వైట్ బాల్ క్రికెట్‌లో భారత జట్టుకి తిరుగులేదని, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ జట్టు టీమిండియా అంటూ పాకిస్థాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్థాన్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతీ జట్టు ఇండియాని ఓడించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుందని ఆయన కొనియాడాడు. ఇటీవల పాకిస్థాన్ జట్టు ప్రదర్శనలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మైక్ హెస్సన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ కోచ్ మైక్ హెస్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్:
పాక్ జట్టుపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. గతేడాది ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో మేం గెలిచాం.. వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలోని ఏ జట్టైనా భారత్‌ను ఓడించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కేవలం పాక్ మాత్రమే కాదు.. ప్రతి జట్టూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోందన్నాడు. తప్పో ఒప్పో పక్కన పెడితే భారత్‌తో ఆడేటప్పుడు పాకిస్థాన్ ప్రదర్శన ఎలా ఉందన్న దాని ఆధారంగానే మా జట్టును అంచనా వేస్తుంటారు. పాక్ పెద్ద టోర్నీల నాకౌట్ దశల్లో నిలకడగా చోటు దక్కించుకునే జట్టుగా ఎదగాలంటే, కేవలం భారత్ గురించే కాకుండా అన్ని జట్లపైనా క్రమం తప్పకుండా విజయాలు సాధించాల్సి ఉంది.
భారత్ వర్సెస్ పాక్ హెడ్ టు హెడ్ రికార్డులు:
ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్‌తో ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్.. ఈ మూడింటిలోనూ ఘోర ఓటమిపాలైంది. అలాగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో దాయాదీ దేశాలు ఒకసారి తలపడగా అక్కడ కూడా భారత్‌నే విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓడినప్పటికీ, ఆ తర్వాత జరిగిన వరుసగా మూడు మెగా టోర్నీల్లో (ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024, 2026) భారత్ విజేతగా నిలిచి వైట్ బాల్ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ALSO READ : ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్ ఫుల్ రిలాక్స్..
ఇంగ్లాండ్ సిరీస్‌పై భారత్ కన్ను:
టీ20 ఫార్మాట్‌లో వరుసగా 16 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన రికార్డు ఉన్న భారత్‌కు.. ఇటీవలే పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియన్ టీమ్ ఆ ఓటమి నుంచి తేరుకుని తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20 మ్యాచ్ రేపు (శనివారం) జరగనుంది.
