కోబ్రా ఫోర్స్‌‌లో మహిళా కమాండోలు

కోబ్రా ఫోర్స్‌‌లో మహిళా కమాండోలు

న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో కీలక దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌‌పీఎఫ్) మహిళా కమాండోల సేవలను విరివిగా వాడుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిసారిగా తన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) యూనిట్‌‌లో విమెన్ కమాండోలను రంగంలోకి దించనుంది. దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు. ఈ కమాండోలకు కౌంటర్ నక్సల్ ఆపరేషన్స్‌‌లో పాల్గొనేందుకు అవసరమైన ట్రెయినింగ్‌‌ను 3 నెలల పాటు ఇవ్వనున్నారు. కమాండో శిక్షణలో భాగంగా మహిళా జవాన్ల శారీరక ధారుఢ్యం, సాంకేతిక అవగాహనను పెంచనున్నారు. అలాగే ఫైరింగ్, స్పెషల్ వెపన్స్ వాడకం, వ్యూహ రచన, ఫీల్డ్ క్రాఫ్ట్, అడవుల్లో నుంచి తప్పించుకోవడం లాంటి స్కిల్స్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత విమెన్ వారియర్లను నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న అడవుల్లో ముఖ్యంగా ఛత్తీస్‌‌గఢ్‌‌లో పోస్టింగ్ వేయనున్నారు.