డీహెచ్​ఎఫ్​ఎల్ మాజీ సీఎండీపై కేసు

 డీహెచ్​ఎఫ్​ఎల్ మాజీ సీఎండీపై కేసు
  • మరికొందరిపై కూడా...

న్యూఢిల్లీ: దివాన్​ హౌజింగ్​ ఫైనాన్స్​ లిమిటెడ్​ (డీహెచ్​ఎఫ్​ఎల్​) మాజీ సీఎండీ కపిల్​ వాధ్వాన్, మాజీ డైరెక్టర్​ ధీరజ్​ వాధ్వాన్​ మరో కేసులో చిక్కుకున్నారు. వీళ్లతోపాటు మరికొందరు బ్యాంకులను రూ.34,615 కోట్లకు మోసం చేశారని సీబీఐ ప్రకటించింది. తాము ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన బ్యాంక్​ ఫ్రాడ్​ కేసుల్లో ఇదే అతిపెద్దదని ప్రకటించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏజెన్సీకి చెందిన 50 మందికి పైగా ఆఫీసర్ల టీమ్​ ముంబైలో  నిందితులకు చెందిన 12 ప్రదేశాలలో  సోదాలు చేసింది.

నిందితుల్లో అమరిల్లిస్ రియల్టర్స్‌‌‌‌కు చెందిన సుధాకర్ శెట్టితోపాటు ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు.  కన్సార్టియం నుండి 2010 –2018 మధ్య రూ. 42,871 కోట్ల మేరకు క్రెడిట్ సదుపాయాన్ని కంపెనీ పొందిందని, అయితే మే, 2019 నుండి అప్పులు కట్టడం మానేసిందని యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (యూబీఐ) తెలిపింది. దీంతో డీహెచ్​ఎఫ్​ఎల్​ ఖాతాలను మొండిబాకీలుగా ప్రకటించింది. నిధుల మళ్లింపు, రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో జనవరి 2019లో డీహెచ్​ఎఫ్​ఎల్​పై​ విచారణ మొదలయింది. దీంతో బ్యాంకులు ఫిబ్రవరి 1, 2019న సమావేశాన్ని నిర్వహించాయి.  అయితే ఆ ఏడాది మే వరకు అప్పులు కట్టింది.

అయినప్పటికీ, ఏప్రిల్ 1, 2015 నుండి డిసెంబర్ 31, 2018 వరకు డీహెచ్​ఎఫ్​ఎల్ ​ఖాతాలకు స్పెషల్​ రివ్యూ ఆడిట్ నిర్వహించడానికి  కేపీఎంజీని నియమించాయి. కపిల్ వాధ్వాన్​ దేశం విడిచి వెళ్లకుండా ఆపేందుకు అక్టోబర్ 18, 2019న వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని ఫిర్యాదు కూడా ఇచ్చాయి. రౌండ్​ ట్రిప్పింగ్, నిధుల మళ్లింపు నిజమేనని కేపీఎంజీ తన ఆడిట్‌‌లో పేర్కొంది. డీహెచ్​ఎఫ్​ఎల్​ ప్రమోటర్లకు చెందిన 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్ల లోన్లు ఇచ్చారని,  రూ. 29,849 కోట్ల బకాయిలు ఉన్నాయని దీని రిపోర్టు వెల్లడించింది. ఈ డబ్బంతా భూములు,  ఆస్తులలో పెట్టుబడిగా పెట్టారని బ్యాంకులు ఆరోపించాయి.