
చంఢీఘర్: యువ టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన రాధిక యాదవ్ పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాధిక ఛాతీలో నాలుగు బుల్లెట్లు దిగినట్లు అటాప్సీ రిపోర్టులో తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాధిక హత్యపై కొత్త అనుమానాలను లేవనెత్తింది. ఎందుకంటే.. రాధికపై వెనుక నుంచి మూడు రౌండ్ల ఫైరింగ్ జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. కానీ తాజాగా వెలువడిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం పోలీసుల ఎఫ్ఐఆర్కు పూర్తి విరుద్ధంగా ఉంది.
పోలీసులు రాధికపై వెనక నుంచి మూడు సార్లు కాల్పులు జరిగాయని పేర్కొంటే.. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం రాధికపై ముందు నుంచి నాలుగు రౌండ్ల ఫైరింగ్ జరిగిందని తేలింది. తన కూతురిపై తానే వెనక నుంచి కాల్పులు జరిపానని మృతురాలి తండ్రి నేరం అంగీకరించాడు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం రాధికపై ముందు నుంచి కాల్పులు జరిగాయని తేలడం మిస్టరీగా మారింది. రాధిక యాదవ్ డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం చేసిన సర్జన్ డాక్టర్ దీపక్ మాథుర్ నేషనల్ మీడియా ఇండియా టూడేతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రాధికపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని, అన్ని బుల్లెట్ గాయాలు ఆమె ఛాతీపై ఉన్నాయని ఆయన చెప్పారు. శరీరం నుండి బుల్లెట్లను తొలగించి ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిపారు. నా కూతురిని వెనక నుంచి కాల్చి నేనే చంపేశానని రాధిక తండ్రి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా.. పోస్ట్‌మార్టం రిపోర్టులో మాత్రం యువతిపై ముందు నుంచి ఫైరింగ్ జరిగిందని తేలడం సస్పెన్స్‌గా మారింది.
►ALSO READ | మీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: కోటర్ కోసం ప్రాణాన్నే రిస్క్ చేసిన మందుబాబు..
కాగా, గురుగ్రాంకు చెందిన రాధికా యాదవ్ అనే టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె తండ్రి దీపక్ యాదవ్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో రాధిక తన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుండగా ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలుసుకున్న రాధికా అంకుల్ కుల్దీప్ యాదవ్ ఆమెను హుటాహుటిన సెక్టార్ 56లోని ఏసియా మారింగో హాస్పిటల్కు తరలించారు.
అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రీ కూతురి మధ్య కొన్నాళ్ల నుంచి రాధికా టెన్నిస్ అకాడమీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పైగా.. సొంతూరికి వెళ్లినప్పుడల్లా కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గూశరం లేదా అని ఊరి జనం సూటిపోటి మాటలతో దెప్పి పొడిచారు. తన కూతురి క్యారెక్టర్ను కూడా తప్పుబట్టారు. ఈ పరిణామం కూడా కూతురిపై ద్వేషాన్ని మరింత పెంచాయి.
ఈ క్రమంలోనే.. కూతురిపై పగతో రగిలిపోతున్న తండ్రి రాధికా యాదవ్ చేసిన మ్యూజిక్ వీడియో ఒకటి నెట్లో రావడం చూశాడు. ఆ వీడియోలో ఒక యువకుడి ప్రేమికురాలిగా రాధికా కనిపించింది. అసలు ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావని ఆమె తండ్రి నిలదీశాడు. ఈ విషయంలో తండ్రీకూతురి మధ్య గొడవ జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న దీపక్ యాదవ్ తన కూతురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య ఇంట్లో లేని సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలోనే గురువారం (జూలై 10) తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్తో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని కాల్చి చంపాడు.