టేకులపల్లి/ కామేపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ అవసరాలకు సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంకిత్ తెలిపారు.
బుధవారం టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ ఆఫీస్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టేకులపల్లి మండలంలో ఐదు రైతు వేదికల ద్వారా యూరియా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18001237157 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను వారు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. కాగా, కామేపల్లి మండలం పాతలింగాల పెద్ద చెరువు కట్టను ఎమ్మెల్యే కోరం ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు.
