రాష్ట్రంలో అగ్ర కులాల వాళ్లు అన్నింట్లోనూ అగ్రస్థానంలోనే ఉన్నారు. ఆస్తిపాస్తుల్లోనూ, వ్యవసాయ భూముల్లోనూ, వ్యాపార రంగం, చదువులు ఒక్కటేమిటి.. దేంట్లోనూ తీసిపోని విధంగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే వాళ్ల జీవనశైలి చాలా బాగున్నట్టు తేటతెల్లమైంది. సమగ్ర సర్వే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పెద్ద పెద్ద ఇండ్లు, మేడలు కూడా ఓసీల్లోనే ఎక్కువున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ట్రిపుల్ బెడ్రూం లేదా అంతకన్నా పెద్ద ఇండ్లు వారికే ఎక్కువున్నట్టు స్పష్టమైంది. ఓసీల్లో 42.8 శాతం మందికి పెద్ద ఇండ్లున్నట్టు తేలింది. అదే బీసీల్లో 28.5 శాతం మందికి, ఎస్టీల్లో 18.9 శాతం మందికి, ఎస్సీల్లో కేవలం 17.6 శాతం మందికే ట్రిపుల్ బెడ్రూం ఇండ్లున్నట్టు వెల్లడైంది. డబుల్ బెడ్రూం లేదా అంతకన్నా చిన్న ఇండ్లల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది బతకాల్సి వస్తున్నది. చిన్న ఇండ్లు ఉన్న వారిలో అత్యధికంగా ఎస్టీల్లో 75.5 శాతం మంది ఉంటే.. ఆ తర్వాత ఎస్సీల్లో 73.7 శాతం మందికి చిన్న ఇండ్లు ఉన్నాయి.
బీసీల్లో 63.9 శాతం మందికి డబుల్ బెడ్రూం కన్నా తక్కువ సైజు ఇండ్లున్నాయి. అదే సమయంలో వారితో పోలిస్తే ఓసీలకు మాత్రం కేవలం 47.4 శాతం మందికే చిన్న ఇండ్లు ఉండడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు కనీసం కరెంట్, టాయిలెట్ల వసతులు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 11 శాతం మంది ఎస్టీల ఇండ్లకు కరెంట్ లేదని రిపోర్ట్ తేల్చింది. ఎస్సీల్లో 8.3 శాతం, బీసీలకు 4.7 శాతం ఇండ్లకు కరెంట్ సౌకర్యాలు లేవని బయటపడింది.
అదే సమయంలో ఓసీల్లోని కేవలం 2.7 శాతం మందికే కరెంట్ సౌకర్యం లేనట్టు నివేదిక వెల్లడించింది. టాయిలెట్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎస్టీల్లోని 32.5 శాతం మంది ఇండ్లలో మరుగుదొడ్లు లేవని నివేదిక తేటతెల్లం చేసింది. అదే సమయంలో ఎస్సీల్లోని 18.8 శాతం, బీసీల్లోని 10.8 శాతం మందికి టాయిలెట్లు లేవని తెలిపింది. అయితే, ఓసీల్లో మాత్రం కేవలం 4.5 శాతం మందికే టాయిలెట్లు లేవని నివేదిక వెల్లడించింది.

