కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్ !.. సోమవారం ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్

కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్ !.. సోమవారం ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్

కేరళ కొత్త సీఎం రేసులో కాంగ్రెస్​ప్రధాన కార్యదర్శి, అలప్పుజ ఎంపీ కేసీ వేణుగోపాల్  ముందంజలో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ​పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ తమ నివేదికను పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేకు సమర్పించిన అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. వచ్చే వారం ఆయన కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

తిరువనంతపురం: కేరళ కొత్త సీఎం రేసులో కాంగ్రెస్​ప్రధాన కార్యదర్శి, అలప్పుజ ఎంపీ కేసీ వేణుగోపాల్ అందరికంటే ముందంజలో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్​పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ తమ నివేదికను పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించిన అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. వచ్చే వారం ఆయన కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, సీఎం రేసులో వేణుగోపాల్‌‌‌‌తో పాటు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేశ్ చెన్నితాల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

అయితే, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, మిత్రపక్షాలు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని మాకెన్, వాస్నిక్ శుక్రవారం తెలిపారు. వీలైనంత త్వరగా సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేయాలని కూడా పార్టీ కోరుకుంటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. 63 ఏండ్ల కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, అలప్పుజ ఎంపీగా ఉన్నారు. ఆయన సీఎంగా ఎంపికైతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

మొత్తం 140 స్థానాలు గల కేరళ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) 102 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ సొంతంగా 63 సీట్లు గెలుచుకోగా.. మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (22), కేరళ కాంగ్రెస్ (7) సీట్లలో విజయం సాధించాయి. అధికారంలో ఉన్న పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. అయితే, యూడీఎఫ్ విజయంలో వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

కార్యకర్తలు ఆయనను 'నాయకన్' (హీరో)గా అభివర్ణిస్తూ పోస్టర్లు కూడా వేశారు. మాకెన్, వాస్నిక్ కొత్త పార్టీ శాసనసభ్యులను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినప్పుడు కేసీ వేణుగోపాల్‌‌‌‌ నే ముఖ్యమంత్రిని చేయాలని అధిక శాతం మంది మద్దతు తెలిపినట్టు తెలిసింది. కాగా, వచ్చే సోమవారం కేరళ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఘనవిజయం సాధించిన సినీ నటుడు, టీవీకే చీఫ్​ విజయ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.