హైదరాబాద్ లో మెగా ఈ -వేస్ట్ సేకరణ డ్రైవ్‌‌.. ఒక్క రోజే 48 టన్నుల సేకరణ

హైదరాబాద్ లో మెగా ఈ -వేస్ట్ సేకరణ డ్రైవ్‌‌..  ఒక్క రోజే  48 టన్నుల సేకరణ
  • మొదలైన స్పెషల్​ డ్రైవ్​
  • నేడూ కొనసాగనున్న కార్యక్రమం 

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్​, వెలుగు: నగర ప్రజలు ఈ – వేస్ట్ ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. మెగా ఈ -వేస్ట్ సేకరణ డ్రైవ్‌‌లో భాగంగా సోమవారం ముషీరాబాద్ సర్కిల్‌‌ బాగ్‌‌లింగంపల్లికి వెళ్లిన ఆయన ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ ఏర్పాట్లను సమీక్షించారు. 

ఫీల్డ్‌‌ స్థాయి సిబ్బందితో మాట్లాడి.. ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక కౌంటర్ల పనితీరుపై తెలుసుకున్నారు. ఈ డ్రైవ్ లో భాగంగా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌‌ టాప్‌‌ లు, కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరిస్తున్నామని చెప్పారు. 

ఇందుకోసం ప్రతి సర్కిల్, డివిజన్‌‌ లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. మెయిన్ సర్కిళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రైవ్ లో భాగంగా సోమవారం 271 లొకేషన్లలో 48 మెట్రిక్ టన్నుల ఈ- – వేస్ట్​ను సేకరించామన్నారు. ఈ  వ్యర్థాల సేకరణకు 94 వాహనాలను వినియోగించామన్నారు. వీటిని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించామని చెప్పారు. మంగళవారం కూడా ఈ  డ్రైవ్ కొనసాగనున్నదని, ప్రజలు సహకరించాలని కోరారు.