కొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి

కొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి

తిరువనంతపురం: కేరళను అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ కేసులు వణికిస్తున్నాయి. అమీబిక్ మెదడు జ్వరం సోకి మరొకరు సోమవారం చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని కోయిలాండిలోని నాదేరి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బిజుగా గుర్తించారు. అతని వయసు 49 సంవత్సరాలు.

కేరళ ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. జూలై 23న బిజుకు అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ (సాధారణంగా బ్రెయిన్ ఫీవర్ అని పిలుస్తారు) ఉన్నట్లు నిర్ధారణ అయింది. సోమవారం బిజు పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడు. అయితే.. అతనికి ఈ ఇన్ ఫెక్షన్ ఎలా సోకిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అనేది అమీబాల వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు సోకే ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి అత్యంత ప్రాణాంతకమైంది కావడం గమనార్హం. సరస్సులు, నదులు, వాగులు కలుషితం కావడం, అలా కలుషితం అయిన నీళ్ల నుంచి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. కేరళ ఆరోగ్య సేవల డైరెక్టరేట్ (డిహెచ్ఎస్) సమాచారం ప్రకారం.. జూలై 25 వరకు రాష్ట్రంలో 154 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు కావడం గమనార్హం. 40 మంది చనిపోయారు.

బిజు మరణంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఒక్క జులై నెలలోనే 13 కేసులు నమోదు కావడంతో కేరళలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బిజు మరణానికి ముందు ముగ్గురు రోగులు కూడా ఇదే వ్యాధితో చనిపోవడంతో జూలై నెలలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.