భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఆమోదించిన తొలి విడత నియామకాలలో భాగంగా మంగళవారం(జూన్ 2) ఐదుగురు కొత్త న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జిలలో పంజాబ్ ,హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జమ్మూ కాశ్మీర్ ,లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. వీరితోపాటు సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ నియామకాలతో చీఫ్ జస్టిస్ మినహా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 33 నుంచి37కు పెరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం ఒక స్థానమే ఖాళీగా ఉంది.జడ్జీల పదోన్నతితో దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు చేరినట్లైంది. వీరిలో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్ వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న జడ్జీలు ఉన్నారు. సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన నియామకం కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నియామకాలతో సుప్రీంకోర్టు పనితీరు మరింత బలోపేతం అవుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
