పార్టీలో చేరిన 3 నెలలకే ఐదుగురు లీడర్ల రాజీనామా

పార్టీలో చేరిన 3 నెలలకే ఐదుగురు లీడర్ల రాజీనామా

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ)కు గట్టి షాక్​ తగిలింది. మూడు నెలల కిందట ఆ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్​తోపాటు మరో నలుగురు లీడర్లు రాజీనామా చేశారు. గోవా నుంచి టీఎంసీలో చేరిన తొలి లీడర్లలో లావూ మామ్లేదార్​ కీలక నేత. ఓట్ల కోసం గోవాలో హిందువులు, క్రిస్టియన్ల మధ్య మత ఘర్షణలు సృష్టించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తున్నదని రాజీనామా అనంతరం ఆయన ఆరోపించారు. బెంగాల్​లో మమత చేస్తున్న పనులు నచ్చి, సెక్యులర్​ పార్టీగా భావించి మూడు నెలల కింద టీఎంసీలో చేరానని, అయితే ఇరవై రోజుల కింద నిజస్వరూపం గ్రహించానని అన్నారు. బీజేపీకన్నా దారుణమైన పార్టీ టీఎంసీ అని, అది కమ్యూనల్​ పార్టీ అని మామ్లేదార్​ ఆరోపించారు. అధికారంలోకి వస్తే గృహ లక్ష్మి పథకం ప్రతి మహిళలకు రూ. 5వేలు ఇస్తామంటూ గోవాలోని మహిళల ఓట్లను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. పోండా నియోజకవర్గం నుంచి మహారాష్ట్రవాదీ గోమంతక్​ పార్టీ (ఎంజీపీ) తరఫున 2012 నుంచి 2017 వరకు లావూ మామ్లేదార్​ ఎమ్మెల్యేగా కొనసాగారు. సెప్టెంబర్​లో ఈయనతోపాటు రామ్​ మంద్రేకర్​, కిషోర్​ పర్వార్​, కోమల్​ పర్వార్​, సుజయ్​ మల్లిక్​ టీఎంసీలో చేరినప్పుడు తాము గోవాలోని మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ.. ఇంతలోనే ఈ ఐదుగురు రాజీనామా చేయడంతో టీఎంసీ షాక్​ తగిలినట్లైంది.